అనంతపురం అర్బన్ శాసనసభ్యుడు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారశైలి, వరుస వివాదాలు, అధికార దుర్వినియోగ ఆరోపణలతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితులు, సొంత పార్టీ నేతల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలకు అద్దం పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా, ఓ వివాహిత మహిళ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై తీవ్ర వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని భైరవనగర్‌లో ఉన్న తన 10 సెంట్ల స్థలాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు రూ.70 లక్షలకు విక్రయించారు. అందులో రూ.10 లక్షలకు చెక్కు ఇచ్చారని, మిగిలిన రూ.60 లక్షలు చెల్లించాలని అడిగినప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె పేర్కొన్నారు.
ఎమ్మెల్యే తనకు పదేపదే వాట్సాప్ సందేశాలు పంపుతూ, ఫోన్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. సెప్టెంబర్ 16న ఎమ్మెల్యే అనుచరులు తనను వెంబడించగా, వారి నుంచి తప్పించుకున్నానని చెబుతూ అనంతపురం డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తనను వేధించవద్దంటూ ఆమె ఎమ్మెల్యేను ప్రాధేయపడుతున్న ఫోన్ కాల్ ఆడియో సంభాషణలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతంలో ‘వార్–2’ సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపు వైరల్ అయి పెద్ద వివాదానికి దారితీసింది. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అనంతపురంలో ఆడనివ్వబోమంటూ హెచ్చరించడంతో పాటు అభ్యంతరకరంగా మాట్లాడటంపై ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపి, ఫ్లెక్సీలను చించేశారు. అనంతరం, తన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర ఉందని పేర్కొంటూ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
ఎమ్మెల్యే ప్రసాద్‌పై సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేశారు. రెండేళ్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే రూ.200 కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు. నగరంలో ఏ స్థలాన్ని కొనాలన్నా, అమ్మాలన్నా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన 200కు పైగా కాల్ రికార్డులు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు.
అధికారులు, వ్యాపారులు, చివరకు సొంత పార్టీ కార్యకర్తలపైనా ఎమ్మెల్యే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలకు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. నెలకు రూ.1.50 లక్షలు మామూళ్లుగా ఇవ్వాలని, లేదంటే సెలవుపై వెళ్లాలని అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ రమణారావును ఎమ్మెల్యే బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ఆడియో వైరల్ అయింది. మున్సిపల్ కాంట్రాక్టర్ శ్రీనివాస చౌదరితో “నెలనెలా డబ్బులు తీసుకుని పో.. వర్కులు చేయొద్దు” అని ఎమ్మెల్యే చెప్పినట్లు ప్రచారంలోకి వచ్చిన సంభాషణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
టీడీపీ సీనియర్ కార్యకర్త ఫక్రుద్దీన్ ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే రూ.10 లక్షలు ‘ఎమ్మెల్యే ట్యాక్స్’గా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అనుచరుడు, గన్‌మన్ దాడికి పాల్పడటంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. నంబూరి వైన్స్ దుకాణంలో తనకు వాటా ఇవ్వలేదన్న కారణంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ దుకాణానికి నిప్పు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీపై ప్రశ్నించిన టీడీపీ మైనార్టీ విభాగం నేత మహబూబ్ బాషాను బెదిరించడంతో పాటు, ఆయన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టించారని బాధితుడు శాసనసభ కమిటీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని ఆడియో ఆధారాలు, బాధితుల ఫిర్యాదులు, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా అధిష్ఠానం దృష్టికి వెళ్లినప్పటికీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం గానీ, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికంగా తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తిపై మహిళలు, అధికారులు, వ్యాపారులను బెదిరించారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ, కనీసం స్పందించకపోవడం కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు, బాధితులకు రక్షణ కల్పించడంలో వ్యవస్థ వైఫల్యంపై విమర్శలకు దారితీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






