దివంగత వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) జనసేన పార్టీలో (Jana Sena Party) చేరడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం సాయంత్రం జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న రాధాకృష్ణకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కళ్యాణ్కు పరిచయం చేశారు.
అయితే, ఈ చేరిక వెనుక విజయవాడ మేయర్ పీఠం లక్ష్యంగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అంగీకారంతోనే రాధాకృష్ణ (Radha Krishna) జనసేనలో చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే తరహా రాజకీయ సమీకరణాలను కూటమి అనుసరించిందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ టీడీపీ(TDP) నుంచి జనసేనలోకి మారి ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు, 2004లోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణను చివరకు మేయర్ స్థాయి పదవికే పరిమితం చేస్తున్నారా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నాగబాబుకు (Naga Babu)ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కూటమి, రాధాకృష్ణకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం లేదా? అని నిలదీస్తున్నారు.
రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న రాధాకృష్ణకు ఆయన స్థాయికి తగిన పదవి ఇవ్వడంలో కూటమి విఫలమైందని ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేనలో రాధాకృష్ణ చేరిక ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రమోషనా? లేక డిమోషనా? అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.







