కొచ్చి డ్రగ్స్ కేసులో రోకళ్ల సత్యనారాయణకు సంబంధించి కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణ బ్యాగులో వివాదాస్పద వస్తువులను తానే పెట్టినట్లు ఆయన సహప్రయాణికుడు అరుణ్‌కుమార్ ఎన్డీపీఎస్ (NDPS) కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ వస్తువుల గురించి సత్యనారాయణకు ఏమీ తెలియదని, తన లగేజీ నిండిపోవడంతో కొన్ని వస్తువులను ఆయన బ్యాగులో పెట్టించినట్లు లేఖలో వివరించినట్లు తెలుస్తోంది.
ఘానాలోని తన స్నేహితుడి అభ్యర్థన మేరకు ఆ వస్తువులను తీసుకున్నానని, సత్యనారాయణను బ్యాంకాక్‌కు ఆహ్వానించడంతో పాటు ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లను తన కంపెనీ స్పాన్సర్ చేసిందని అరుణ్‌కుమార్ పేర్కొన్నట్లు సమాచారం. కొచ్చి విమానాశ్రయంలో ఆ వస్తువుల్లో మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించడంతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సత్యనారాయణకు న్యాయం చేయాలని కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం. ఈ లేఖ నేపథ్యంలో కేసుకు సంబంధించిన ఆరోపణలు, ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చిన కథనాలపై మరోసారి చర్చ మొదలైంది.
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తి కాకినాడకు చెందిన వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు రోకళ్ల సత్య అంటూ అధికార పార్టీకి అనుకూలమైన మీడియాలో వార్తలు ప్రసారమైన నేపథ్యంలో, ప్రస్తుతం ఈ వ్యవహారంతో రోకళ్ల సత్యకు ఎలాంటి సంబంధం లేదని సహ ప్రయాణికుడి వాంగ్మూలంతో వెల్లడైంది. వైసీపీ వ్యక్తిగా పేర్కొంటూ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం స్పష్టమైంది. అయితే, రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడటం గతంలో సంచలనం సృష్టించిన విషయం విదితమే.







