తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రం గ్రామంలో రైతుల వ్యవసాయ భూముల మీదుగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు నిర్మించారనే ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. భూసేకరణ చేయకుండా, తమ అనుమతి లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారని బాధిత రైతులు కాశిరెడ్డి సుబ్బానరసమ్మ, ముద్ద సుజయ్ హైకోర్టును ఆశ్రయించారు. WP 7039/2026 పిటిషన్పై 2026 జూలై 3న విచారణ సందర్భంగా, రైతుల భూముల మీదుగా గ్రావెల్ రోడ్డు నిర్మించే ప్రతిపాదన లేదని గ్రామ పంచాయతీ తరఫు న్యాయవాది కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో హైకోర్టు పిటిషన్ను పరిష్కరించింది. అయితే, కోర్టుకు ఇచ్చిన వివరణకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో రోడ్డు నిర్మాణం పూర్తయిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం, చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తినీ ఆయన ఆస్తి నుంచి వేరు చేయరాదు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియ, రైతుల ఆస్తి హక్కులు, అధికారుల బాధ్యతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా రూ.4.75 కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు వ్యవహారంలో అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఆరోపించింది. రైతుల భూములపై రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించకుండా ప్రతిపక్షంపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది.





