ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పటికీ చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. తాజాగా అసెంబ్లీలో మంత్రి పొంగూరు నారాయణ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మళ్లీ రగిలించాయి. అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షం మాట మార్చిందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో, అసలు నిజం ఏమిటి అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
29 గ్రామాల్లో రాజధాని నిర్మాణాన్ని జగన్ గారు ముందుగా అసెంబ్లీలో స్వాగతించి, తరువాత మాట మార్చారని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక ఎడిటెడ్ వీడియోతో చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఏకంగా అసెంబ్లీలోనే ప్రతిపక్షంపై అధికార పక్షం ఈ అంశంలో విమర్శలకి దిగిన నేపధ్యంలో నిజంగా జగన్ గారు 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణాన్ని ఒప్పుకున్నారా? లేక ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారా? అనే విషయాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపధ్యంలో వాస్తవాల కోసం రాజధాని ఎంపికకు సంభందించి 10 సంవత్సరాల క్రితం జరిగిన టైమ్‌లైన్‌ను ఒకసారి పరిశీలిస్తే… 2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు గారు జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 సెప్టెంబర్ 4న విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. దానికి అసెంబ్లీలో జగన్ గారు “విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, అయితే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలి” అని తెలిపారు.
(అప్పటికి 29 గ్రామాలు రాజధాని ప్రాంతం అంటూ ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. విజయవాడ, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ, ఆగిరిపల్లి వంటి ప్రాంతాలపై మాత్రమే ఊహాగానాలు ఉన్నాయి.) ఈ నేపథ్యంలోనే జగన్ గారు ఆ ప్రకటన చేశారు. ఆయన ఎక్కడా 29 గ్రామాల్లో రైతుల భూముల్లో రాజధాని నిర్మాణానికి ఒప్పుకున్నట్టు చెప్పలేదు. పైగా, రాజధాని ఎంపికలో ప్రతిపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను భాగస్వామ్యం చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వారు నాడే విమర్శించారు.
ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు చూస్తే 2014 డిసెంబర్ 22న అసెంబ్లీలో నాటి మంత్రి నారాయణ గారు సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా, రాజధానిని విజయవాడ–గుంటూరు మధ్య కృష్ణా నది తీరంలోని గ్రామాల్లో నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే, ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములను సేకరిస్తామని తెలిపారు. ఈ ప్రకటనను అప్పటి ప్రతిపక్ష నేత జగన్ గారు స్వాగతించలేదు. రైతుల భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నయా జమీందార్లను తయారు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. సీఆర్డీఏ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని అసెంబ్లీలోనే చెప్పారు.
2014 డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీఏ చట్టం అమలులోకి వచ్చింది. 2015 ఏప్రిల్ 1న తుల్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలను కలుపుకుని కొత్త రాజధానికి “అమరావతి” అని నామకరణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చివరగా, 2015 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల భూముల్లో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్న జగన్ గారు ఆ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నప్పటికీ బహిష్కరించారు.
వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ గారు ముందుగా అమరావతిని ఒప్పుకుని తరువాత మాట మార్చారని చేసే ప్రచారం వాస్తవాలకు విరుద్ధంగా కనిపిస్తుంది. అమరావతి రాజధాని పేరిట తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ గారు రాజధాని నిర్మాణంపై తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అధిక వ్యయాన్ని తగ్గించే దిశగా ఉన్నాయని ఆయన మొదటి నుండి వాదించారు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలును రాజధానులుగా అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానం అని ప్రకటించారు. అయినప్పటికీ, ఆయన ఆలోచనలను వక్రీకరించి, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నారనే విధంగా కొన్ని వర్గాలు ప్రచారం చేశాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిపై కొత్త హామీలు ఇస్తున్నప్పటికీ, రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పినా, తాజాగా మూడు సంవత్సరాల గడువు చెప్పడం రాజకీయంగా విమర్శలకు దారితీసింది. రాజధాని పేరుతో మరిన్ని దశల్లో భూసేకరణ చేపడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైతుల సమస్యలు, వరద నియంత్రణ కోసం భారీ ఖర్చులు వంటి అంశాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే, రాజధాని అంశం కేవలం అభివృద్ధి ప్రణాళికగా కాకుండా తెలుగుదేశానికి రాజకీయ ఆయుధంగా మారిందనే అభిప్రాయం బలపడుతోంది. వాస్తవాలను పక్కనబెట్టి తెలుగుదేశం అసత్య ఆరోపణలు, కొనసాగుతున్న నేపథ్యంలో, రాజధాని నిర్మాణంలో కూటమి చిత్తశుద్దిపై ప్రజల్లో మరింత గందరగోళం పెరుగుతోంది.






