కర్ణాటక రాజకీయాలు (Karnataka Politics) ప్రస్తుతం ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి మార్పుపై (Chief Minister Change) గత కొన్ని రోజులుగా ఊహాగానాలు జోరుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ అధిష్టానం (Congress High Command) కీలక సంకేతాలు ఇచ్చింది. ఇవాళ ఇందిరా భవన్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), మల్లికార్జున ఖర్గేతో (Mallikarjun Kharge) కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది.
భేటీ ముగిసిన తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా ఊహాగానాలేనని స్పష్టం చేశారు. సమావేశంలో అలాంటి అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై మాత్రమే చర్చించామని వెల్లడించారు.
అయితే బయటకు వస్తున్న ప్రకటనలకంటే లోపల జరిగిన చర్చలు భిన్నంగా ఉన్నాయనే ప్రచారం జాతీయ రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రాజ్యసభ (Rajya Sabha) ద్వారా ఢిల్లీ రాజకీయాల్లోకి రావాలని సూచించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఆయనకు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజ్యసభ ద్వారా పార్లమెంట్ రాజకీయాల్లోకి రావాలని సిద్ధరామయ్యను అధిష్టానం కోరినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో పార్టీకి మరింత సేవ చేయాలని, రాష్ట్ర రాజకీయాల వ్యవహారాలను తాము చూసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కేసీ వేణుగోపాల్ “రాజ్యసభ ఎన్నికలపైనే (Rajya Sabha Elections) చర్చించాం” అని చెప్పిన వ్యాఖ్యల వెనుక కూడా సిద్ధరామయ్యను ఢిల్లీకి పంపించే వ్యూహం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) మద్దతు లభిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పోరు తలెత్తకుండా ఉండాలంటే ఇప్పుడే నాయకత్వ మార్పు చేయడం మంచిదని ప్రియాంక గాంధీ అభిప్రాయపడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కేరళ రాజకీయాల్లో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా ప్రియాంక గాంధీ ప్రభావం బలంగా కనిపించిందనే చర్చ జరిగింది. ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కూడా ఆమె అభిప్రాయానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తే జాతీయ స్థాయిలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆమె పట్టు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








