దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ (Paper Leak) కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన మనీష్ యాదవ్‌ను (Manish Yadav) రాజస్థాన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ (Arrest) చేశారు. అతడితో పాటు మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కెరీర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మనీష్ యాదవ్ ఈ మొత్తం లీక్ వ్యవహారాన్ని ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. ముందుగా మహారాష్ట్రలోని నాసిక్‌లో(Nashik) ప్రశ్నాపత్రాన్ని డూప్లికేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఆ పేపర్‌ను హర్యానాకు తరలించినట్లు తేలింది. అనంతరం హర్యానాలో ప్రశ్నాపత్రాన్ని 5 వేర్వేరు సెట్లుగా మార్చి రాజస్థాన్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలకు పంపించినట్లు గుర్తించారు.
ఈ నెల 1, 2 తేదీల మధ్య “గెస్ పేపర్”(Guess Paper) పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రశ్నాపత్రాలను షేర్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో పరీక్షకు 42 గంటల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.






