పశ్చిమాసియా (West Asia) యుద్ధ ప్రభావం (War Impact) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతున్న వేళ భారత్‌లో కూడా ఇంధన సంక్షోభ (Fuel Crisis) సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) దేశ ప్రజలకు ఇచ్చిన పొదుపు పిలుపును కేంద్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపిస్తూ ప్రధాని మోడీ కాన్వాయ్‌ను (Convoy) భారీగా తగ్గించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇటీవల జరిగిన పర్యటనల్లో ప్రధాని మోడీ కేవలం 2 వాహనాల్లోనే ప్రయాణించడం విశేషంగా మారింది. గతంలో భారీ భద్రతా వలయంతో నడిచే ప్రధాని కాన్వాయ్ ఇప్పుడు సగానికి పైగా తగ్గిపోవడం ద్వారా ఇంధన పొదుపుపై కేంద్రం ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతోంది. ఇదే దారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కాన్వాయ్ కూడా కేవలం 3 వాహనాలతోనే నడిచింది. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గడం గమనార్హం.
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర పెద్దలు స్వయంగా ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే అనేక దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా భారత్(India) కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్(Hyderabad) లో జరిగిన సభలో ప్రధాని మోడీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.
దేశ భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు పొదుపు అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు తగ్గించాలని, అవసరం లేని విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
హైదరాబాద్ సభ తర్వాత 24 గంటలు గడవక ముందే వడోదర (Vadodara) లో జరిగిన మరో కార్యక్రమంలో కూడా ప్రధాని ఇదే అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందన్న సంకేతాల మధ్య కేంద్రం పొదుపు మంత్రాన్ని ప్రధాన అజెండాగా తీసుకువచ్చిందనే చర్చ జరుగుతోంది.






