పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా 3 సార్లు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి (Mamata Banerjee) కలకత్తా హైకోర్టు (Calcutta High Court) ప్రాంగణంలో తీవ్ర అవమానకర పరిస్థితి ఎదురైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయం అనంతరం ఆమెపై వ్యతిరేక స్వరాలు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.
గురువారం ఎన్నికల అనంతర హింస, టీఎంసీ కార్యాలయాలపై దాడులకు సంబంధించిన కేసు విచారణలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ హైకోర్టుకు హాజరయ్యారు. అయితే కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆమెను ఉద్దేశిస్తూ “దొంగ.. దొంగ” (“Thief… Thief”) అంటూ నినాదాలు చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ పరిణామంపై స్పందించిన మమతా బెనర్జీ.. “వారు నాపై దాడి చేశారు” అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. ఘటన అనంతరం ఆమె వెంటనే కోర్టు ప్రాంగణాన్ని వీడి వెళ్లిపోయారు. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇక ఈ వ్యవహారంపై టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభావిత వ్యక్తులు మమతా బెనర్జీతో పాటు సీనియర్ న్యాయవాది కళ్యాణ్ బెనర్జీని (Kalyan Banerjee) అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. మమతాను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి పార్టీ న్యాయ బృందం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఈ సందర్భంగా కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ.. “ఒకరిని దొంగగా, బందిపోటుగా ముద్ర వేయడానికి కోర్టు సరైన వేదిక కాదు. మమతా బెనర్జీకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సాధారణ టీఎంసీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మే 4న వెలువడిన ఫలితాల్లో మొత్తం 294 స్థానాల్లో బీజేపీ(BJP) 207 సీట్లు గెలుచుకోగా, టీఎంసీ(TMC) కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని టీఎంసీ ఆరోపిస్తోంది.
ఈ కేసుకు సంబంధించి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ (Sujoy Paul), జస్టిస్ పార్థ సారథి సేన్ (Partha Sarathi Sen)లతో కూడిన ధర్మాసనం ముందు మమతా బెనర్జీ తన వాదనలు వినిపించారు.






