అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కుమార్తె టిఫనీ ట్రంప్ (Tiffany Trump) 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి భారత్‌లో(India) పర్యటిస్తున్నారు. తన భర్త మైఖేల్ బౌలోస్‌తో(Michael Boulos) కలిసి శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఆమె.. వారాంతం మొత్తం దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూ బిజీగా గడుపుతున్నారు. భారత్ పర్యటనపై ఆమె ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా.. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఢిల్లీ చేరుకున్న వెంటనే టిఫనీ ట్రంప్ దంపతులు ప్రముఖ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టత, అద్భుతమైన వాస్తుశిల్పం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టిఫనీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “భారత్ పర్యటన ఎంతో అద్భుతంగా, చిరస్మరణీయంగా సాగుతోంది” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
తాజ్ మహల్ అందాలకు ఫిదా
ఆదివారం ఉదయం టిఫనీ ట్రంప్, మైఖేల్ బౌలోస్‌తో కలిసి ప్రపంచ ప్రఖ్యాత ప్రేమ చిహ్నం తాజ్ మహల్‌ను (Taj Mahal) సందర్శించారు. సుమారు గంటన్నర పాటు అక్కడ గడిపిన ఈ జంట.. తాజ్ మహల్ చరిత్ర, నిర్మాణ విశేషాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ కట్టడం అందాలను ఆస్వాదిస్తూ పలుమార్లు ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది.
తాజ్ మహల్ సందర్శన అనంతరం మధ్యాహ్నం ఆగ్రాలోని (Agra) ఖేరియా విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు బయలుదేరి వెళ్లారు. జైసల్మేర్‌లో ఆమె పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే రాజస్థాన్‌లోని చారిత్రక కోటలు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే అవకాశముందని సమాచారం.
8 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టిన టిఫనీ
టిఫనీ ట్రంప్‌కు భారత్ కొత్త కాదు. 2018లో తన తండ్రి డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఆమె తొలిసారిగా భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో కూడా ఢిల్లీ, ఆగ్రా నగరాలను సందర్శించారు. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత రెండోసారి భారత్ పర్యటనకు రావడం విశేషంగా మారింది.
ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ కూడా 2020 ఫిబ్రవరిలో తన భార్య మెలానియాతో కలిసి అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో తాజ్ మహల్‌ను సందర్శించిన ఆయన.. దానిని “శాశ్వతమైన ప్రేమకు ప్రతీక”గా అభివర్ణించారు. ఇప్పుడు అదే చారిత్రక కట్టడాన్ని ఆయన కుమార్తె టిఫనీ సందర్శించడం ఆసక్తికరంగా మారింది.
గ్లామర్, ఫ్యాషన్‌తో ప్రత్యేక గుర్తింపు
టిఫనీ ట్రంప్ కేవలం అమెరికా అధ్యక్షుడి కుమార్తెగానే కాకుండా.. తన గ్లామరస్ స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె పంచుకునే ఫొటోలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్లు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆమె భారత్ పర్యటనకు సంబంధించిన చిత్రాలు కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
టిఫనీ ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన మాజీ భార్య మార్లా మాపుల్స్‌కు (Marla Maples) జన్మించిన కుమార్తె. ట్రంప్ కుటుంబంలో ఆమె 4వ సంతానం. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్, బారన్ ట్రంప్ ఆమెకు తోబుట్టువులు. టిఫనీ 2020లో ప్రతిష్టాత్మక జార్జ్‌టౌన్ యూనివర్శిటీ లా సెంటర్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం 2022 నవంబర్ 12న అమెరికన్-లెబనీస్ వ్యాపారవేత్త మైఖేల్ బౌలోస్‌ను వివాహం చేసుకున్నారు.








