తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసిన కేటీఆర్
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర్య సమరానికి ఏమాత్రం తీసిపోని గొప్ప పోరాటమని పేర్కొన్నారు. 1968 నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఎన్నో దశల్లో కొనసాగిందని, వేలాది మంది యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.
కేసీఆర్ పాత్రపై కీలక వ్యాఖ్యలు
2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని, 2004లో తెలంగాణ హామీతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందని కేటీఆర్ తెలిపారు. దాదాపు 10 సంవత్సరాల పాటు సాగిన ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కేసీఆర్ పట్టుదల, దీక్ష వల్లే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. “సచ్చుడో తెలంగాణ వచ్చుడో” నినాదంతో కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు నడిపారని, తెలంగాణ సమాజం మొత్తం ఆయన వెంటే నిలిచిందని వివరించారు.
తెలంగాణ అభివృద్ధిపై కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రూపురేఖలను పూర్తిగా మార్చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయని తెలిపారు. దేశంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. తెలంగాణ సాధించిన అభివృద్ధికి సమానంగా మరో రాష్ట్రం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ లేదా బీజేపీ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రచారంపై తీవ్ర విమర్శలు
కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోయినందుకు తమకు బాధ లేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న ఆశయాలు నెరవేరకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
“రైజింగ్ తెలంగాణ” కాదు.. “ఫాలింగ్ తెలంగాణ”
“రైజింగ్ తెలంగాణ” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కేవలం మాటలకే పరిమితమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు చూస్తే “ఫాలింగ్ తెలంగాణ”లా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కరోనా కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ పేరును జపించడం తప్ప మరేం చేయడం లేదని ఆరోపించారు.
భూముల వేలం, రైతులపై ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం
భూముల వేలం ద్వారా వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రైతు డిస్కం ఏర్పాటు ఆలోచన రైతులకు నష్టదాయకమని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ రంగానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.







