కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ నేడు రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో సాయంత్రం 4.05 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. డీకే శివకుమార్‌తో పాటు 10 మందికి పైగా మంత్రులు కూడా ఈరోజే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొత్త ప్రభుత్వంలో డాక్టర్ జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మంత్రి మండలి కూర్పుపై చర్చలు ముగిసినట్లు సమాచారం. నేడు ఉదయం మంత్రివర్గ జాబితాను తానే స్వయంగా ప్రకటిస్తానని డీకే శివకుమార్ వెల్లడించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.
లోక్ భవన్‌లో భారీ ఏర్పాట్లు
ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం లోక్ భవన్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 4,000 మందికి పైగా కూర్చునేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేతల హాజరు
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. మొత్తం 35 మంది వీవీఐపీలకు ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది.
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడతో పాటు మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డీ కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై, జగదీష్ షెట్టర్, వీరప్ప మొయిలీలకు కూడా డీకే శివకుమార్ స్వయంగా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టే ముందు డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బెంగళూరులోని అజ్జయ్య మఠంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేడు ఉదయం కూడా పలు దేవాలయాల్లో దర్శనాలు చేసుకుని దైవ ఆశీస్సులు పొందారు.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే తొలి నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
ప్రమాణ స్వీకారం చేసే అవకాశమున్న నేతలు
నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశమున్న నేతల్లో యతీంద్ర సిద్ధరామయ్య, డాక్టర్ జి. పరమేశ్వర, యు.టి. ఖాదర్, కె.జె. జార్జ్, కృష్ణ బైరే గౌడ, ఎం.బి. పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కె.హెచ్. మునియప్ప, దినేష్ గుండూ రావు తదితరులు ఉన్నారు.







