కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. సీఎం పదవి నుంచి తప్పుకున్న సీనియర్ నేత సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదిక అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్యను నియమిస్తూ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గత కొన్ని వారాలుగా కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగిన అంతర్గత చర్చలు, ఒప్పందాల అనంతరం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి గౌరవప్రదంగా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి ఆయన చేసిన సేవలు, సీనియారిటీ, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇకపై ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో సిద్ధరామయ్య ఢిల్లీ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీ వర్కింగ్ కమిటీలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అత్యున్నత గౌరవం కల్పించినట్టుగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
దేశ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేతగా గుర్తింపు పొందిన సిద్ధరామయ్య.. ఇకపై కాంగ్రెస్ జాతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తూనే.. ఢిల్లీలో తన రాజకీయ ప్రభావాన్ని కొనసాగించే దిశగా సిద్ధరామయ్య అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.







