---Advertisement---

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు సొంత పార్టీయే షాక్.. అమెరికా పార్లమెంట్‌లో సంచలన తీర్మానం!

June 4, 2026

---Advertisement---

అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ (Iran) యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ట్రంప్ అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ తాజాగా ఆమోదించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ (Republican Party) సభ్యులే డెమోక్రాట్లకు మద్దతుగా నిలవడం అమెరికా రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు రేపుతోంది.

హోరాహోరీగా సాగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. కేవలం 7 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందడం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందో స్పష్టం చేస్తోంది.

రిపబ్లికన్ పార్టీకి చెందిన థామస్ మాస్సీ(Thomas Massie), బ్రియాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్(Brian Fitzpatrick), టామ్ బారెట్(Tom Barrett), వారెన్ డేవిడ్‌సన్ (Warren Davidson) వంటి కీలక నేతలు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి డెమోక్రాట్లతో కలిసి ఓటేయడం మరింత సంచలనంగా మారింది. ఈ సందర్భంగా టామ్ బారెట్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిందని, ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. థామస్ మాస్సీ మాట్లాడుతూ.. పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), ఎరువుల (Fertilizers) ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. దీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధంపై ప్రజలతో పాటు పార్లమెంట్ సభ్యుల్లో కూడా అసహనం పెరిగిందని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే అమెరికాలో అమల్లో ఉన్న ‘వార్ పవర్స్ యాక్ట్’(War Powers Act) ప్రకారం అధ్యక్షుడు విదేశాల్లో దీర్ఘకాల సైనిక చర్యలు చేపట్టాలంటే కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అయితే ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’(Operation Epic Fury) ఇప్పటికే 60 రోజుల పరిమితిని దాటినా ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆమోదం తీసుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో పెంటగాన్, అమెరికా విదేశాంగ శాఖ, యూఎస్‌ఏఐడీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఇరాన్ యుద్ధంపై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు. న్యూయార్క్‌కు చెందిన డెమోక్రటిక్ నేత గ్రెగొరీ మీక్స్ (Gregory Meeks) మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి అధికారాలను పర్యవేక్షించడం కాంగ్రెస్ బాధ్యత (Congress Responsibility) అని తెలిపారు. ఈ అంశంలో రిపబ్లికన్ల మద్దతు రావడం చారిత్రాత్మక పరిణామమని వ్యాఖ్యానించారు.

అయితే హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ (Mike Johnson) మాత్రం ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం శాంతి చర్చలు, దౌత్య ప్రయత్నాలపై దృష్టి పెట్టిందని, ఇలాంటి తీర్మానాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరుస్తాయని ఆయన అన్నారు. ఇరాన్‌లో అమెరికా సైనిక లక్ష్యాలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఇప్పుడు శాంతి ఒప్పందం కోసం ట్రంప్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రతినిధుల సభ ఆమోదించిన ఈ తీర్మానం తదుపరి చర్చల కోసం సెనేట్‌కు వెళ్లనుంది. ఇది వెంటనే చట్టంగా మారకపోయినా.. కాంగ్రెస్, దర్యాప్తు సంస్థలు, సొంత పార్టీ నేతల నుంచే ట్రంప్‌కు ఎదురవుతున్న ప్రశ్నలు అమెరికా రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వంపై రాజకీయ, చట్టపరమైన ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment