హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అమర్‌నాథ్ (Amarnath) ఎన్నిక (Election) చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు వెలువరించింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని స్పష్టం చేసిన ధర్మాసనం.. హెచ్‌సీఏ ఏజీఎం సెక్రటరీ (AGM Secretary) ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని తక్షణమే ఎన్నుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు తెలంగాణ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అమర్‌నాథ్ 62 ఓట్లు సాధించగా.. అప్పటి అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు (Jaganmohan Rao) 63 ఓట్లతో కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రక్రియలో ‘శ్రీ చక్ర క్లబ్’(Sri Chakra Club) పేరిట సమర్పించిన పత్రాలు నకిలీవని ఆరోపిస్తూ అమర్‌నాథ్ బీసీసీఐ(BCCI) అంబుడ్స్‌మన్‌ను (Ombudsman) ఆశ్రయించారు.
ఇప్పటికే 2018లో అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి (Justice L. Narasimha Reddy) ఇచ్చిన తీర్పులో గౌలీపురా క్లబ్ (Gowlipura Club) పేరును ‘శ్రీ చక్ర సీసీ’’ (Sri Chakra CC)గా మార్చడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారని అమర్‌నాథ్ తన ఫిర్యాదులో వివరించారు. దీంతో ఆ క్లబ్‌కు చట్టబద్ధమైన ఉనికి లేదని ఆయన వాదించారు. హెచ్‌సీఏ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు అప్పట్లో రన్నరప్‌గా నిలిచిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తూ జస్టిస్ కైత్ నిర్ణయం తీసుకున్నారు.
అయితే అమర్‌నాథ్ నియామకం చట్టబద్ధం కాదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇరు వర్గాల వాదనలు సవివరంగా విన్న తెలంగాణ హైకోర్టు.. చివరకు అమర్‌నాథ్ ఎన్నిక చెల్లదని తేల్చిచెప్పింది. తాజా తీర్పుతో హెచ్‌సీఏలో మరోసారి రాజకీయ, పరిపాలనా కలకలం రేగే అవకాశం కనిపిస్తోంది.






