తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన తొలి రెండేళ్ల కాలంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’తో పాటు మొత్తం 143 హామీలు కూటమి విజయానికి ప్రధాన కారణమయ్యాయి. అయితే వాటి అమలు విషయంలో ప్రజల్లో నిరాశ పెరుగుతోందని చెబుతున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు పరిమిత స్థాయికే పరిమితమయ్యాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీపం పథకం కింద సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ రాష్ట్రంలోని మెజారిటీ కుటుంబాలకు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, అది ఒకే డీఎస్సీ నోటిఫికేషన్‌కే పరిమితమైందని అది కూడా అక్రమాల పుట్టగా మారిందని అలాగే ఖాళీల సంఖ్యకు తగిన స్థాయిలో నియామకాలు జరగలేదని విమర్శకులు పేర్కొంటున్నారు.
రైతులకు ప్రతి సంవత్సరం రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినప్పటికీ, మొదటి ఏడాది ఆ హామీ అమలు కాలేదని, తరువాతి దశలో కూడా సొంత భూమి కలిగిన రైతులకే అరాకోరాగా పరిమితమైందని అంటున్నారు. కౌలు రైతులకు సహాయం అందకపోవడం ప్రధాన విమర్శగా మారింది. అలాగే ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధి వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం ఆశించిన చర్యలు తీసుకోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల వాస్తవ పరిస్థితుల్లో మహిళలకు ఇబ్బందులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.
అత్యంత చర్చనీయాంశంగా మారింది ‘సూపర్ సిక్స్’లో భాగంగా ప్రకటించిన పలు కీలక హామీల అమలు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలకు నెలకు రూ.1,500 అందించే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శలు ఉన్నాయి. కౌలు రైతుల గుర్తింపుకు చట్టం తీసుకువస్తామని, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ సంస్థ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు కూడా కార్యరూపం దాల్చలేదని పేర్కొంటున్నారు.
అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా, కొత్త పింఛన్ల మంజూరులో పురోగతి కనిపించడం లేదని, లక్షలాది మంది ఇంకా ఎదురుచూస్తున్నారని విమర్శకులు అంటున్నారు. మూడు సెంట్ల ఇళ్ల స్థలం, టిడ్కో ఇళ్ల పూర్తి పంపిణీ, చంద్రన్న బీమా, డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ రుణాలు, ముఠా కార్మికుల సంక్షేమ బోర్డు వంటి పలు హామీలు కూడా అమలు దశకు చేరలేదని ఆరోపిస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించి ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి సమాధానం చెబుతుందా? లేక నెరవేరని వాగ్దానాలే రానున్న రాజకీయ పరిణామాలను ప్రభావితం చేస్తాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






