విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కార్మికుల (Workers) పరిస్థితిపై సమాజం మొత్తం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) అన్నారు. తొలి నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీయేనని, ప్రస్తుతం కూటమి పాలనలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో (Seven Hills Hospital) విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో కార్మికుడు 95 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉండేదో, ప్రస్తుతం కూటమి పాలనలో ఎలా మారిందో ప్రజలు గమనించాలని జగన్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను (Privatization) అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం గట్టిగా పోరాడిందని, ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) 2021 ఫిబ్రవరి 6, మార్చి 9 తేదీల్లో లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం దిగిపోయే సమయానికి స్టీల్ ప్లాంట్‌లో 28 వేల మంది ఉద్యోగులు (Employees) పనిచేస్తుండగా, గత రెండేళ్లలో 10,500 మంది ఉద్యోగులను తొలగించారని జగన్ ఆరోపించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో పాటు, 1,800 మందిపై వీఆర్‌ఎస్ కోసం ఒత్తిడి తెచ్చారని, ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 16 వేలకు పడిపోయిందని తెలిపారు.
కూటమి పాలనలో ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, నాలుగు నెలలుగా జీతాలు బకాయిలుగా ఉన్నాయని జగన్ విమర్శించారు. ఉద్యోగుల జీతాలను ఉత్పత్తితో అనుసంధానం చేయడం, క్వార్టర్స్‌లో విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 50 పైసల నుంచి రూ.8.50కు పెంచడం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బోనస్, వైద్య సదుపాయాలు కూడా అందడం లేదని ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి కార్మికులు కారణం కాదని, లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ (Liquid Metal Blast) కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని జగన్ పేర్కొన్నారు. 14 నెలల క్రితం జరిగిన ఇలాంటి ప్రమాదంలో మరణించిన పెంటయ్య (Pentaiah) కుటుంబానికి నెల రోజుల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు హామీ నెరవేర్చలేదని, పరిహారం కూడా అందలేదని గుర్తు చేశారు. అధికారులు ఫైల్ పోయిందని చెబుతున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఇలాంటి విషాద సమయంలో మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి పరిహారం ప్రకటించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పారిశ్రామిక ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే రూ.1 కోటి పరిహారం అందించి బాధిత కుటుంబాలను ఆదుకున్నామని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రం (Central Government), పీఎం రిలీఫ్ ఫండ్ (PM Relief Fund) నుంచే పరిహారం ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ.1 కోటి పరిహారం ప్రకటించడంతో పాటు ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఆ బాధ్యత నిర్వర్తించకపోతే, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారాన్ని తామే అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.







హోంమంత్రి అనిత వర్సెస్ అమర్నాథ్ పోరులో టీడీపీకే ఎదురుదెబ్బ తగిలిందా?