ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలో ఉన్న వేళ అనంతపురం అర్బన్ (Anantapur Urban) నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో(TDP) అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాకుండా సొంత పార్టీలోనే ‘టీడీపీ వర్సెస్ టీడీపీ’(TDP vs TDP) పోరు బహిరంగంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై (Daggubati Venkateswara Prasad) మాజీ ఎమ్మెల్యే వై. ప్రభాకర్ చౌదరి (Y. Prabhakar Chowdary) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ కోటాలో(Governor Quota) దలవాయి రమాదేవికి(Dalavai Ramadevi) ఎమ్మెల్సీ పదవి దక్కిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తన సీటును త్యాగం చేసిన ప్రభాకర్ చౌదరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే రమాదేవికి (Dalavai Ramadevi) ఎమ్మెల్సీ కేటాయించడంతో ప్రభాకర్ చౌదరికి అవకాశం దూరమైందని ఎమ్మెల్యే వర్గీయులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకోవడం, ఎద్దేవా చేయడం ఆయన అసంతృప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌పై ప్రభాకర్ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తన బంధువులు, అనుచరులతో కలిసి అనంతపురం నగరంలో సుమారు రూ.200 కోట్ల విలువైన భూములను కబ్జా (Land Encroachment) చేశారని ఆయన ఆరోపించారు. భైరవ నగర్‌లోని 7.5 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించి కబ్జా చేశారంటూ ఆరోపణలు చేశారు. అదేవిధంగా కంచర్ల కనకదుర్గకు (Kancharla Kanakadurga) చెందిన ఆస్తిని ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేర్లకు అక్రమంగా మార్చుకున్నారని, దీనికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
నగరంలో సామాన్యులు ఇళ్లు నిర్మించుకునే సమయంలో ఇసుక, కంకర పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని కూడా ఆరోపించారు. సబ్‌రిజిస్ట్రార్, మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎమ్మెల్యే బంధువులు, అనుచరుల ప్రభావం ఉందని ఆయన విమర్శించారు. సస్పెండ్ అయిన ఓ సబ్‌రిజిస్ట్రార్ ఎమ్మెల్యేకు నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందంటూ మాట్లాడిన ఆడియో తన వద్ద ఉందని ప్రభాకర్ చౌదరి వెల్లడించారు. అలాగే డైగ్లాస్ స్కూల్ సమీపంలో టీ బంక్ నిర్వహించే రాజు(Raju) అనే వ్యక్తిపై ఎమ్మెల్యే దాడి చేశారని కూడా ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే తన భార్య పేరుతో ఉన్న డీవీ ఇన్‌ఫ్రా (DV Infra) సంస్థ ద్వారా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరిధిలో రూ.32 కోట్ల కాంట్రాక్టులు పొందారని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. టెండర్ల వ్యవహారంలో ఎమ్మెల్యేకు సంబంధించిన ఆడియో రికార్డులు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ కోసం గత ఐదేళ్లుగా పనిచేసిన కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలకు సంబంధించిన సుమారు 1,000 పేజీల సమాచారాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్‌తో(Palla Srinivas Yadav) పాటు ఇతర పార్టీ పెద్దలకు అందజేశానని తెలిపారు. తన వద్ద దాదాపు 200 ఆడియో రికార్డులు ఆధారాలుగా ఉన్నాయని కూడా ప్రకటించారు.
అవసరమైతే బాధితులను రెండు బస్సుల్లో అమరావతికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) సమక్షంలో బహిరంగ విచారణకు సిద్ధమని ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు. తనకు ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవులు అవసరం లేదని, సామాన్య కార్యకర్తగా ఉన్నా అక్రమాలపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు సంబంధించిన ఇతర వివాదాలు రాజకీయంగా చర్చనీయాంశంగా ఉన్న సమయంలో ప్రభాకర్ చౌదరి చేసిన తాజా ఆరోపణలు అనంతపురం టీడీపీలో అంతర్గత సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఈ ఆరోపణలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ వివాదంపై విచారణకు ఆదేశిస్తారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.







