2024 ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ(Assembly), లోక్సభ(Lok Sabha) ఎన్నికల ప్రక్రియపై(Elections Process) గతంలో వ్యక్తమైన అనుమానాలు, ఆరోపణలు మరోసారి చర్చకు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ(Voter Lists Revision), ఈవీఎంల వినియోగంపై (EVMs Usage) రాజకీయ పార్టీలు, పౌరసమాజ సంస్థలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల గణాంకాలపై కూడా విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 2023లో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు అనంతరం ఏర్పడిన ఎంపిక విధానంలో 2023 డిసెంబరులో చట్టపరమైన మార్పులు జరిగాయి. అనంతరం 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసిన కొద్ది రోజులకే జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar), సుఖ్బీర్ సింగ్ సంధు (Sukhbir Singh Sandhu) ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు. ఈ ప్రక్రియపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఎన్నికల సంఘం స్వతంత్రతపై చర్చకు తెరతీశాయి.
2024 ఏపీ ఎన్నికల్లో పోలైన ఓట్లు, తుది లెక్కల్లో నమోదైన ఓట్ల మధ్య ఉన్న వ్యత్యాసంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(Association for Democratic Reforms – ADR) సహా పలు వర్గాలు ప్రశ్నలు ఇప్పటికే లేవనెత్తాయి. మే 13న సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించగా, తుది గణాంకాల్లో పోలింగ్ శాతం 81.79కి చేరింది. ఈ తేడాకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘం మరింత స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.
ఆర్థికవేత్త, విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ (Dr. Parakala Prabhakar) కూడా ఈ గణాంకాలను విశ్లేషిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. మే 13 రాత్రి 11:45 గంటల నుంచి మే 14 తెల్లవారుజామున 2 గంటల మధ్య సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో 17,19,482 ఓట్లు నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ లెక్కల ఆధారంగా అర్ధరాత్రి సమయంలో ఓట్ల నమోదుపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) సహా పలువురు నేతలు వీవీప్యాట్ స్లిప్పుల (VVPAT Slips) పూర్తి స్థాయి లెక్కింపుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ చర్చకు తాజాగా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్(Prakash Raj) చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఏపీ 2024 ఎన్నికలపై తాను అధ్యయనం చేస్తున్నానని, రెండు వారాల్లో పూర్తి ఆధారాలతో విలేకరుల సమావేశం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఏపీ 2024 ఎన్నికలపై ఇప్పటికే ఉన్న గణాంకాలు, విశ్లేషణలు, రాజకీయ ఆరోపణలకు తోడు కొత్తగా మరిన్ని ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.






