డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాల వ్యవహారం రోజురోజుకూ మరింత తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వెలుగులోకి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు నియామక ప్రక్రియపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల్లో అర్హతలు, ధ్రువపత్రాల చెల్లుబాటు, కేటగిరీ మార్పులపై అభ్యర్థులు చేస్తున్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.
కర్నూలు జిల్లాలో టెట్ అర్హత సాధించకపోయినా స్పోర్ట్స్ కోటా కింద నకిలీ తప్పుడు సర్టిఫికెట్లను ఉపయోగించి ప్రభాకర్ గౌడ్ అనే అభ్యర్థి ఎస్‌జీటీ ఉపాధ్యాయ ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ప్రభాకర్‌కు వల్లూరు ఎంపీపీఎస్‌లో టీచర్‌గా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద అప్పలరాజు అనే అభ్యర్థి బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యవహారంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నది పెద్ద అప్పలరాజు కాకుండా ఆయన తమ్ముడు పాండా అప్పలరాజు అని, తమ్ముడికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఉపయోగించి అన్న ఉద్యోగం పొందారనే ఫిర్యాదులు ఉన్నాయి.
కర్నూలు జిల్లాకు చెందిన కరిష్మా, ఇమామ్ దంపతులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వ్యవహారం కూడా అనుమానాలకు తావిస్తోంది. దొర్నిపాడు వారి స్వస్థలం కాగా, జూడో సర్టిఫికెట్లలో భార్య స్వస్థలం విజయనగరం, భర్త స్వస్థలం విశాఖపట్నంగా పేర్కొన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. హరికృష్ణ అనే జూడో క్రీడాకారుడికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఫోర్జరీ చేసి దంపతులిద్దరికీ ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎస్‌ఏ ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన మునవ్వర్ రసూల్ వ్యవహారంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2008, 2012, 2018 డీఎస్సీ పరీక్షల్లో బీసీ-ఈ కేటగిరీలో పోటీ చేసిన ఆయన.. 2025 మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పరీక్ష రాసి ఉద్యోగం పొందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో బీసీ-ఈ కేటగిరీకి సంబంధించిన అధికారిక ధ్రువపత్రాలు ఉన్న వ్యక్తికి ఏ నిబంధనల ప్రకారం మైదుకూరు రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం జారీ చేశారన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
ఇక డీఎస్సీ స్పోర్ట్స్ కోటాకే పరిమితం కాకుండా దివ్యాంగుల కోటాలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన సుభాషిణిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఓపెన్ కేటగిరీలో టెట్‌కు అవసరమైన అర్హత మార్కులు సాధించకపోయినా దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందారని మరో అభ్యర్థి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఆమె సమర్పించిన దివ్యాంగుల ధ్రువపత్రం చెల్లుబాటుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక జిల్లాకు బదులుగా మరో జిల్లా నుంచి వైద్య ధ్రువీకరణ పత్రం పొందడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్పోర్ట్స్ కోటాలో సుధారాణి అనే అభ్యర్థి ఉద్యోగం పొందిన వ్యవహారంపైనా ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. జూడో టోర్నమెంట్ జరగకపోయినా జరిగినట్లు, అందులో తాను పాల్గొన్నట్లు చూపించే నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగం పొందారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
ఇలా డీఎస్సీ–2025 నియామకాల్లో జిల్లాల వారీగా వెలుగులోకి వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు నియామక ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలన్నీ దర్యాప్తు చేసి అక్రమాలను భయటపెట్టాల్సిన ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు వెనకడుగు వేయడం పలు అనుమానాలకి అవకాశం కల్పిస్తుంది.





