డీఎస్సీ–2025(DSC-2025) ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు(Teacher Recruitments Irregularities), అవకతవకలు(Malpractices), నకిలీ ధ్రువపత్రాల (Fake Certificates) ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ కోటాలకు సంబంధించిన నియామకాలపై అనేక ఫిర్యాదులు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు, శ్రీకాకుళం, కడప, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థుల నియామకాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్నూలు జిల్లాలో టెట్ అర్హత సాధించకపోయినా స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) నకిలీ ధ్రువపత్రాలతో ప్రభాకర్ గౌడ్ (Prabhakar Goud) ఎస్‌జీటీ ఉద్యోగం (SGT Job) పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ఆయనకు వల్లూరు ఎంపీపీఎస్‌లో పోస్టింగ్ లభించినట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లాలో పెద్ద అప్పలరాజు బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యవహారంపైనా ఆరోపణలు ఉన్నాయి. పోటీల్లో పాల్గొన్నది ఆయన తమ్ముడు పాండు అప్పలరాజు కాగా, తమ్ముడి సర్టిఫికెట్‌ను అన్న ఉపయోగించుకున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.
కర్నూలు జిల్లాలో కరిష్మా, ఇమామ్ అనే భార్యాభర్తలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన అంశంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూడో సర్టిఫికెట్లలో వారి స్వస్థలాలు వేర్వేరు జిల్లాలుగా నమోదవడం, మరో క్రీడాకారుడి సర్టిఫికెట్‌ను ఫోర్జరీ చేసి ఉపయోగించారనే ఆరోపణలు విచారణకు దారితీస్తున్నాయి.
కడప జిల్లాలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికైన మునవ్వర్ రసూల్ వ్యవహారంపైనా ప్రశ్నలు తలెత్తాయి. గతంలో జరిగిన డీఎస్సీ పరీక్షల్లో బీసీ-ఈ కేటగిరీలో పోటీ చేసిన ఆయన 2025 మెగా డీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎలా అర్హత సాధించారనే దానిపై వివరణ కోరుతున్నారు.
అదే జిల్లాలో దివ్యాంగుల కోటాలో ఉద్యోగం పొందిన సుభాషిణిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. టెట్ అర్హత(TET Qualification), దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం, వైద్య ధ్రువీకరణకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
కర్నూలు జిల్లాలో మరికొందరు అభ్యర్థులు గతంలో బీసీ కేటగిరీలో దరఖాస్తు చేసుకుని, 2025లో ఓసీ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే టెట్ రాయకుండానే స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.
జూడో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పలువురు అభ్యర్థులు తప్పుడు వివరాలతో ధ్రువపత్రాలు సమర్పించారని ఆరోపణలు ఉన్నాయి. పోటీలు జరిగిన తేదీలు, విజేతల వివరాలు, కేటగిరీలు వంటి అంశాల్లో తేడాలు ఉన్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ఫారమ్–2 ధ్రువపత్రాల జారీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక కృష్ణా జిల్లాలో డీఎస్సీ–2025 సోషల్ స్టడీస్ టాపర్‌గా ప్రకటించిన పి.నవీన్ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఎస్సీఆర్టీలో అవుట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ డీఎస్సీ ప్రశ్నలను ఆన్‌లైన్ చేసే బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తికే ఫలితాల్లో టాప్ ర్యాంకులు రావడం అనుమానాలకు కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.14.50 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితురాలు రాధిక ఆరోపించారు. ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మించి డబ్బులు తీసుకున్నారని, అనంతరం డీఎస్సీ పరీక్ష కూడా రాయొద్దని చెప్పడంతో తన కెరీర్ దెబ్బతిన్నదని ఆమె వాపోయారు.
ఈ ఆరోపణలు, ఫిర్యాదులన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిజంగా నకిలీ ధ్రువపత్రాలు, నిబంధనల ఉల్లంఘనలు లేదా ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయా? జరిగితే వాటికి బాధ్యులు ఎవరు? డీఎస్సీ–2025 నియామకాలపై పెరుగుతున్న ఈ ప్రశ్నలకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.





