అర్హత లేని ఉపాధ్యాయుల (Teachers) నియామకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేయడం.. ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) డీఎస్సీ-2025 (DSC-2025) నియామకాల చుట్టూ నెలకొన్న వివాదంపై కొత్త చర్చకు దారితీసింది. కనీస విద్యార్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యార్థుల(Students) భవిష్యత్తు దెబ్బతింటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అస్సాం ఉపాధ్యాయ నియామకాలు(Assam Teacher Recruitment), విలీన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Justice Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యా హక్కు చట్టం-2009(Right to Education Act-2009), ఎన్సీటీఈ చట్టం-1993(NCTE Act-1993), యూజీసీ చట్టం-1956 ప్రకారం నిర్దేశించిన కనీస అర్హతలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. టెట్(TET), బీఈడీ(B.Ed), డీఎల్ఎడ్(D.El.Ed) వంటి నిర్దేశిత అర్హతలు లేని వారిని ఉపాధ్యాయులుగా నియమించడం లేదా రెగ్యులర్ చేయడం నిబంధనలకు విరుద్ధమనే అంశాన్ని కోర్టు స్పష్టంగా ప్రస్తావించింది.
ఈ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా టెట్లో కనీస అర్హత సాధించని వారు, టెట్ పరీక్షకు హాజరుకాని వారు సైతం స్పోర్ట్స్ కోటా(Sports Quota) వంటి మార్గాల ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నియామక ప్రక్రియలో నిబంధనలు పక్కన పెట్టారనే విమర్శలు, అభ్యర్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు(Supreme Court) తాజా ఆదేశాల నేపథ్యంలో, ఉపాధ్యాయ నియామకాల్లో కనీస అర్హతలు, పారదర్శకత, ప్రతిభా ప్రాతిపదిక వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో డీఎస్సీ నియామకాల్లో నిజంగానే నిర్దేశిత అర్హతలను పక్కన పెట్టారా? స్పోర్ట్స్ కోటా పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
డీఎస్సీ నియామకాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వివరాలు వెల్లడించాలని, అర్హతల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. మరోవైపు, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నియామక ప్రక్రియపై సీబీఐ(CBI) వంటి సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.





