ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) 16,000 ఉపాధ్యాయ పోస్టుల (Teachers Posts) భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ (DSC) నియామకాల్లో భారీ అక్రమాలు(Irregularities), అవినీతి (Corruption) చోటుచేసుకున్నాయని జై భీమ్ భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) నాయకుడు జడా శ్రవణ్ కుమార్ (Jada Sravan Kumar) ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ పోస్టును కూడా భర్తీ చేయలేదన్న లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ, 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు గత ప్రభుత్వం వారి వయస్సును పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
డీఎస్సీ నిర్వహణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ద్వారా పేపర్ సెట్టింగ్ (Paper Setting) దశలోనే లీకేజీ జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని శ్రవణ్ కుమార్ (Sravan Kumar) డిమాండ్ చేశారు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో లక్షలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు పొందారని, మెరిట్ అభ్యర్థులకు దక్కాల్సిన పోస్టులను డబ్బులు తీసుకుని అనర్హులకు దివ్యాంగుల కోటా (Disabled Quota) కింద కేటాయించారని ఆరోపించారు. టెట్ అర్హత (TET Eligibility) లేని కొందరికి రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగాలు కల్పించారని కూడా పేర్కొన్నారు.
అదేవిధంగా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ (EWS Reservation) నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 1,500 నుంచి 1,600 మంది అనర్హులు నకిలీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో ఎంపికయ్యారని శ్రవణ్ ఆరోపించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత భూమి, నివాస ఆస్తి లేదా ఆదాయ పరిమితులను మించిన కుటుంబాలకు చెందిన వారు ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులు కాదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, పలు ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్లు, రైస్ మిల్లులు వంటి ఆస్తులు ఉన్న కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎంపికయ్యారని ఆరోపించారు.
నకిలీ సర్టిఫికెట్ల జారీ కోసం కొందరు తహసీల్దార్లు (Tahsildars) భారీగా లంచాలు (Bribes) తీసుకున్నారన్న ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని విమర్శించారు. మరోవైపు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో(Scheduled Areas) ట్రైబల్ వెల్ఫేర్ (Tribal Welfare) శాఖ పరిధిలో భర్తీ చేయాల్సిన సుమారు 3,000 ఉపాధ్యాయ పోస్టులను సాధారణ డీఎస్సీలో కలపడం ద్వారా గిరిజన యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి, నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ (CBI Investigation) లేదా హైకోర్టు (High Court) పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని జడా శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.





