---Advertisement---

పరిశ్రమల్లో నిరంతర ప్రమాదాలు – పవన్ కళ్యాణ్ సేఫ్టీ ఆడిట్ హామీలు ఏమయ్యాయి?

October 3, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) పారిశ్రామిక ప్రాంతాల్లో(Industrial Areas) నిత్యం ఏదో ఒకచోట ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో విధుల్లో ఉన్న కార్మికులు(Workers), ఉద్యోగుల (Employees) ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం(Coalition Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదేపదే చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ రెండు రోజులు హడావుడి చేయడం, విచారణలు, ఆడిట్లంటూ హామీలు గుప్పించడం, ఆ తర్వాత వాటిని పూర్తిగా గాలికి వదిలేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక భద్రతపై(Industrial Safety) ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి వరుసగా జరుగుతున్న దుర్ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2024 ఆగస్టులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ (Achutapuram SEZ)పరిధిలోని ఎసెన్షియా కంపెనీలో(Escientia Company సంభవించిన ఘోర ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాత స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పరిశ్రమల్లో భద్రతా చర్యలను బలోపేతం చేస్తామని, సెప్టెంబర్‌లో విశాఖలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మూడు నెలల్లో సమగ్ర కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. అయితే ఆ హామీలు అమల్లోకి రాకుండా కాగితాలకే పరిమితమయ్యాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో(Visakhapatnam Steel Plant) జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో ఘటనాస్థలాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, ఫలితం లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని మర్చిపోయారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలోని(Sri City) టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో(Till Healthcare Industry) బాయిలర్ (Boiler) పేలి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో నాయుడుపేటకు చెందిన మోహన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్(Gourab Roy), చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్(Chinna Mastan), తమిళనాడులోని మాదరపాకానికి చెందిన రమేష్‌తో(Ramesh) పాటు మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. వాసు అనే కార్మికుడు తీవ్ర గాయాలతో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

పరిశ్రమల్లో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి కార్మికులు మరణించినప్పుడు ప్రభుత్వం, అధికారులు రెండు రోజుల పాటు సమీక్షలు, తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత సేఫ్టీ ఆడిట్ల ప్రక్రియను, ఇచ్చిన హామీలను విస్మరిస్తుండటంతో యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిలకడలేని ప్రకటనల వల్లే కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించారు? రక్షణ నిబంధనలు పాటించని ఎన్ని కంపెనీలపై చర్యలు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ ప్రకటించిన సమగ్ర కార్యాచరణ ఏ మేరకు అమలులోకి వచ్చింది? ఈ ప్రశ్నలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇప్పటివరకు నిర్వహించిన సేఫ్టీ ఆడిట్లు, తీసుకున్న చర్యలపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిశ్రమల్లో నిరంతర తనిఖీలు నిర్వహించి, కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయకపోతే మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment