గుంటూరు (Guntur) జిల్లాలో మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటనలో టీడీపీ (TDP) కార్యకర్తతో సహా ముగ్గురి అరెస్టుకు సంబంధించిన వార్తను ‘ది న్యూస్ మినిట్’(The News Minute) చీఫ్ ఎడిటర్ ధన్య రాజేంద్రన్ (Dhanya Rajendran) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఆ పోస్టును తొలగించేందుకు ఏపీ పోలీసులు (AP Police) ఎఫ్‌బీఐ (FBI) పేరుతో ఎక్స్ (ట్విట్టర్)కు ఫిర్యాదు చేశారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఈ చర్యపై ధన్య రాజేంద్రన్ పోలీసులను ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ (Dr. Rayapati Shailaja) స్పందిస్తూ.. గుంటూరు ఘటన బాధితురాలు, ఆమె కుమారుడు సోషల్ మీడియాలో ఉన్న వివస్త్రం చేసిన వీడియోలను తొలగించాలని కోరారని, వారి విజ్ఞప్తి మేరకే పోలీసులను సంప్రదించినట్లు తెలిపారు. అయితే, ఈ వివరణను ధన్య రాజేంద్రన్ ఖండిస్తూ, తాను ఎలాంటి వీడియోను పోస్ట్ చేయలేదని, కేవలం ఘటనకు సంబంధించిన వార్తను టెక్స్ట్ రూపంలోనే రిపోర్ట్ చేశానని స్పష్టం చేశారు. నేరం జరిగినప్పుడు జర్నలిస్టుగా(Journalist) వార్తను రిపోర్ట్ చేయకూడదా? అని ఆమె ప్రశ్నించారు.
ధన్య రాజేంద్రన్ స్పందన తర్వాత రాయిపాటి శైలజ నుంచి తదుపరి వివరణ రాకపోవడంతో, కుట్రపూరితంగా ఏపీ ప్రభుత్వం (AP Government) వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో జర్నలిస్టు వర్గాలు, పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. వార్తా కథనంలోని టెక్స్ట్ పోస్టును వీడియో తొలగింపు అంశంతో ముడిపెట్టడంపై ప్రశ్నలు లేవనెత్తారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.వి. రమేష్(P.V. Ramesh), ‘ది సౌత్ పోస్ట్’(The South Post) ఎడిటర్ తదితరులు పోలీసుల చర్యలపై, వాటిని సమర్థించే ప్రయత్నాలపై విమర్శలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ఎంత తీవ్రంగా అణిచివేస్తుందో చెప్పడానికి, ప్రస్తుతం జాతీయ స్థాయిలో జర్నలిస్టులు ఏపీ పోలీసుల తీరుతో ఎదుర్కొంటున్న ఇబ్బందులే సాక్ష్యమని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) ప్రభుత్వ తీరును ఎండగడుతోంది.






