వాయువ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal), పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure Area) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(AP State Disaster Management Authority) తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు (Gusty Winds) వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు సముద్రం అలజడిగా మారి భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో మత్స్యకారులు (Fishermen) సముద్రంలోకి వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
ఉత్తరాంధ్రలో వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.
సముద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి అనిత సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఆమె స్పష్టం చేశారు.
తీర ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ(Inland Areas) పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో సహాయక బృందాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.







