గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు (Village,Ward Secretariat Employees) తమ న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళనకు దిగిన నేపథ్యంలో, వారిపై పోలీసుల చర్యలతో పాటు ప్రభుత్వ అనుకూల మీడియా వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. టీవీ5 (TV5) చర్చా కార్యక్రమంలో(Debate Programme) సాంభశివరావు (Sambasiva Rao) చేసిన వ్యాఖ్యలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు, పౌర సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఉన్నత విద్యార్హతలు కలిగి ప్రభుత్వ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ‘యాంటీ సోషల్ ఎలిమెంట్స్’(Anti-Social Elements), నేరస్థులుగా చిత్రీకరించడం సరికాదని, సంబంధిత ఛానల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో ‘ఛలో విజయవాడ’ (Chalo Vijayawada) కార్యక్రమానికి వచ్చిన ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సింది పోయి అడ్డుకోవడం, లాఠీఛార్జ్‌కు (Lathi Charge) పాల్పడటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఉద్యోగులను (Women Employees) పోలీసులు ఈడ్చుకెళ్లడం, బస్సుల్లోకి తరలించడం వంటి ఘటనలు అమానుషమని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో ఏర్పడిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై రాజకీయ కక్షతో ఉద్యోగులపై అదనపు పనిభారం, తరచూ సర్వేల పేరుతో వేధింపులు పెరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన సచివాలయ ఉద్యోగులను గౌరవించాల్సింది పోయి, వారినే అనుకూల మీడియాతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీలూ అంటూ ధూషణలకు పాల్పడటం ప్రభుత్వ ఉద్యోగులనే(Government Employees) నిందితులుగా చిత్రీకరించడం అన్యాయమని ఉద్యోగులు అంటున్నారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, విమర్శలను ఎదుర్కొంటున్న మీడియా వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





