ఏపీ కేబినెట్ (AP Cabinet) సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాలసీకి (Influencers Policy) ఆమోదం తెలుపుతూ విధివిధానాలను ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ పథకాలు(Government Schemes), అభివృద్ధి కార్యక్రమాలపై (Development Programs) ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశ్వసనీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి, వారి ఫాలోవర్ల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించి చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పాలసీ ప్రకారం లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకు గరిష్ఠంగా రూ.15 వేలు, 50 వేల నుంచి 99,999 ఫాలోవర్లు ఉన్నవారికి రూ.7,500 వరకు, 25 వేల నుంచి 49,999 ఫాలోవర్లకు రూ.5 వేల వరకు, 10 వేల నుంచి 24,999 ఫాలోవర్లు ఉన్నవారికి రూ.2,500 వరకు చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు రాష్ట్రంలో కొత్త పెన్షన్లు (New Pensions) ఇవ్వడానికి నిధులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు (Achannaidu) చెబుతున్నారని, ఆడబిడ్డ నిధి (Aadabidda Nidhi) అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త బస్సులు కొనుగోలు చేసే పరిస్థితిలో ఆర్టీసీ(RTC) లేదని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ (Konakalla Narayana) వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై (Super Six Promises) అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి.
అదే సమయంలో ఆరోగ్యశ్రీ బకాయిలు(Aarogyasri Dues), ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement), విద్యార్థులకు కిట్ల పంపిణీ(Students Kits Distribution) వంటి అంశాల్లో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులు(Employees), కార్మికుల(Workers) సమస్యల పరిష్కారానికి నిధుల కొరతను ప్రస్తావించే ప్రభుత్వం.. తన పాలనను ప్రచారం చేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు చేయడానికి మాత్రం నిధులు కేటాయించడం ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే ఈ పాలసీ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వ పనితీరుపై పెరుగుతున్న విమర్శలను ఎదుర్కొనేందుకు, ప్రచారాన్ని బలోపేతం చేసేందుకే ఈ విధానం తీసుకొచ్చారా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు నిధుల కొరతను ప్రస్తావిస్తూ.. మరోవైపు ప్రభుత్వ ప్రచారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై రాజకీయంగా ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





