---Advertisement---

చదువుకున్నా ఉద్యోగం లేదు.. ఏపీలో యువతకు పెరుగుతున్న నిరుద్యోగం?

September 25, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) యువతకు (Youth) ఉద్యోగ అవకాశాలపై (Employment Opportunities) ఆందోళన కలిగించే అంశాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్‌బుక్ ఆఫ్ యూత్ ఆపర్చునిటీస్ (Andhra Pradesh State Handbook of Youth Opportunities) నివేదిక వెల్లడించింది. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో(GITAM University) ఎంపీ శ్రీభరత్ (Sri Bharat) చేతుల మీదుగా, ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ (Future India Foundation) ఆధ్వర్యంలో ఈ నివేదిక విడుదలైంది.

రాష్ట్రంలోని 26 జిల్లాలను దాదాపు 180 సూచికలతో, 27 ప్రభుత్వ డేటాబేస్‌ల ఆధారంగా ఈ నివేదిక పరిశీలించింది. ఆపర్చునిటీ, పార్టిసిపేషన్, పని, విద్య, నైపుణ్యాభివృద్ధి అనే ఐదు అంశాల ఆధారంగా యువత పరిస్థితిని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌కు 45.3 యూత్ పవర్ స్కోర్ వచ్చింది. ఇది రాష్ట్రాల సగటు స్కోర్ 47.8 కంటే తక్కువ. రాష్ట్రంలో 1.23 కోట్ల మంది యువత ఉండగా, వారిలో 46.4 శాతం మంది మాత్రమే వర్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. యువత నిరుద్యోగిత (Youth Unemployment) 16.2 శాతంగా ఉంది. మరో 28.4 శాతం మంది చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణలో లేరని నివేదిక స్పష్టం చేసింది.

చదువు పెరిగేకొద్దీ నిరుద్యోగం పెరగడం నివేదికలో ప్రధాన ఆందోళనగా కనిపించింది. సెకండరీ విద్య లేదా అంతకంటే తక్కువ చదివిన వారిలో నిరుద్యోగిత 3 శాతంగా ఉండగా, హయ్యర్ సెకండరీ విద్య ఉన్నవారిలో ఇది 12 శాతానికి చేరింది. కాలేజీ గ్రాడ్యుయేట్లలో ఏకంగా 41 శాతం మంది ఉద్యోగం లేకుండా ఉన్నారని నివేదిక వెల్లడించింది.

ఇందులో యువతుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. డిగ్రీ పూర్తి చేసిన యువతుల్లో 49 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని నివేదిక పేర్కొంది. యువకుల్లో ఈ రేటు 37 శాతంగా ఉందని తెలిపింది.

మరోవైపు, పాఠశాలల్లో మౌలిక వసతులు (Infrastructure) మెరుగుపడ్డాయని నివేదిక పేర్కొంది. దాదాపు 99 శాతం పాఠశాలల్లో విద్యుత్, బాలికల కోసం పనిచేసే టాయిలెట్లు, ఇంటర్నెట్ సదుపాయం ఉన్నట్లు తెలిపింది. ఇది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకం ద్వారా అందిన ఫలితాలుగా నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లల్లో దీర్ఘకాలిక పోషకాహార లోపం కూడా 31 శాతం నుంచి 25 శాతానికి తగ్గిందని వెల్లడించింది. ఇది కూడా గోరుముద్ద పథకం ఫలితమేనని విద్యావేత్తలు చెబుతున్నారు.

డిజిటల్ యాక్సెస్‌లోనూ(Digital Access) యువతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2021 నుంచి 2024 మధ్య యువతుల్లో ఇంటర్నెట్ వినియోగం 21 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. బ్యాంకు ఖాతాలు ఉన్న యువతుల శాతం 92కి చేరింది.

అయితే పాఠశాలల్లో వసతులు పెరిగినా, విద్యా ప్రమాణాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. 6వ తరగతి విద్యార్థుల్లో కేవలం 48 శాతం మంది భాషా ప్రమాణాలను, 41 శాతం మంది గణిత ప్రమాణాలను అందుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి మూడు పాఠశాలల్లో ఒకటి ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తోంది.

యువత ఉపాధిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. గత ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగంలో(Agriculture Sector) పనిచేస్తున్న యువత వాటా 43 శాతం నుంచి 32 శాతానికి తగ్గింది. రెగ్యులర్ జీతభత్యాల ఉద్యోగాల వాటా 24 శాతానికి పెరిగింది. అయినప్పటికీ, ప్రతి 10 మంది యువ ఉద్యోగుల్లో ముగ్గురు తాత్కాలిక లేదా క్యాజువల్ పనులపైనే ఆధారపడుతున్నారు.

జిల్లాల వారీగా చూస్తే, విశాఖపట్నం 55 యూత్ పవర్ స్కోర్‌తో 26 జిల్లాల్లో మొదటి స్థానంలో నిలిచింది. విశాఖలో 60 శాతం మంది యువ కార్మికులు రెగ్యులర్ జీతభత్యాల ఉద్యోగాల్లో ఉన్నారు. సాధారణ జిల్లాలో ఈ వాటా 21 శాతంగా ఉంది.

విశాఖలో ఒక్కో కార్మికుడు సృష్టించే ఆర్థిక విలువ ₹1.79 లక్షలుగా ఉండగా, సాధారణ జిల్లాలో ఇది ₹1.42 లక్షలుగా ఉంది. 15–21 ఏళ్ల వయసున్న యువతుల్లో చదువుకు దూరంగా ఉన్న వారి వాటా విశాఖలో 15 శాతం కాగా, సాధారణ జిల్లాలో 33 శాతంగా ఉందని నివేదిక తెలిపింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment