---Advertisement---

అయ్యన్నపాత్రుడు రాజకీయ రిటైర్మెంట్ వ్యాఖ్యలు.. ‘స్పీకర్ సెంటిమెంట్’ భయం వెంటాడుతోందా?

September 5, 2026

Summarize with AI

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాజకీయాల్లో స్పీకర్‌ పదవికి (Speaker Post) సంబంధించిన ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్‌ (Sentiment) మరోసారి చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని, వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని అసెంబ్లీ స్పీకర్‌ సీహెచ్‌. అయ్యన్నపాత్రుడు (C.H. Ayyanna Patrudu) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

తన జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ప్రస్తుత పదవీకాలం మరో మూడేళ్లు మాత్రమే ఉన్నందున ఈలోపే ఏదైనా మంచి పని చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక కేవలం వయసు, విశ్రాంతి కారణాలే ఉన్నాయా? లేక ఏపీలో చాలాకాలంగా కొనసాగుతున్న ‘స్పీకర్‌ సెంటిమెంట్‌’(Speaker Sentiment) కూడా ఆయన నిర్ణయంపై ప్రభావం చూపిందా? అనే చర్చ మొదలైంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన పలువురు కీలక నేతలు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన సందర్భాలు కనిపిస్తాయి. 1991-1994 మధ్య స్పీకర్‌గా పనిచేసిన శ్రీపాదరావు(Sripada Rao) 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. ఏపీ అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్‌గా రికార్డు సృష్టించిన కె. ప్రతిభాభారతి(K. Pratibha Bharathi) కూడా 2004 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2004-2009 మధ్య స్పీకర్‌గా ఉన్న కె.ఆర్. సురేష్‌రెడ్డి(K.R. Suresh Reddy) 2009లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు(Kodela Siva Prasada Rao) 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పరాజయం పాలయ్యారు. గత వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) కూడా 2024 ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి ఓటమి చవిచూశారు.

ఇలా చూస్తే.. స్పీకర్‌ కుర్చీలో కూర్చున్న తర్వాత తదుపరి ఎన్నికల్లో విజయం సాధించడం అరుదైన పరిణామంగా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో 2024లో స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ‘స్పీకర్‌ సెంటిమెంట్‌’(Speaker Sentiment) చర్చ మొదలైంది.

ఇప్పుడు ఏకంగా భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోనని అయ్యన్నపాత్రుడు ప్రకటించడం ఆ చర్చకు మరింత ఊతమిచ్చింది. వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయమేనా? లేక స్పీకర్‌గా పనిచేసిన నేతల రాజకీయ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఓటమి సెంటిమెంట్‌ కూడా ఆయనను ఆలోచింపజేస్తోందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment