మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Family Unit) ఇప్పుడు ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. పెద్దగా యాక్షన్ హంగులు లేకుండానే చక్కటి కథ, కుటుంబ అనుబంధాలు, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది.
విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సత్తా చాటింది. కేవలం 30 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. గతంలో రూ.302 కోట్లతో ఉన్న ‘లోక చాప్టర్: 1 చంద్ర’(Loka Chapter: 1 Chandra) రికార్డును ఈ చిత్రం అధిగమించింది.
‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన గిరీష్ ఏడీ (Girish AD) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నివిన్ పౌలీ, మమితా బైజు (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో నటించారు. 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమకథతో పాటు కుటుంబ బంధాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సెప్టెంబర్ 4న తెలుగులో విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.
ఈ సినిమా అక్టోబర్ 2 నుంచి జియో హాట్‌స్టార్‌లో(JioHotstar) స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. గాంధీ జయంతి సందర్భంగా ఓటీటీలోకి వస్తున్న ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ (Feel-Good Romantic Entertainer) డిజిటల్ వేదికపై ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.







