వైఎస్సార్సీపీ(YSRCP) సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) గురువారం చీపురుపల్లి నియోజకవర్గంలోని (Cheepurupalli Constituency) గరివిడిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన మేనల్లుడు, మాజీ విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasa Rao) (చిన్న శ్రీను) ఇటీవల టీడీపీలో(TDP) చేరిన అంశం ప్రస్తావనకు రావడంతో బొత్స కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో తనతో కలిసి పనిచేసిన మజ్జి శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకోవడంతో ఆయన భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్న నేతలు, కార్యకర్తలు బొత్సను సముదాయించారు.
రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు, గెలుపోటములు, సంక్షోభాలను ఎదుర్కొన్న బొత్స.. కార్యకర్తల ముందే కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలే నిజమైన వెన్నుదన్ను అని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు రావచ్చు, పోవచ్చు కానీ పార్టీ మాత్రం శాశ్వతమని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆశయాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.





