---Advertisement---

చంద్రబాబు చెప్పిన 30 వేల మరణాలు ఎక్కడ? అధికారిక గణాంకాల్లో ఏముంది?

September 10, 2026

Summarize with AI

---Advertisement---

సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో(Collectors Conference) ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జగన్‌ పాలనలో ‘జే బ్రాండ్స్‌’ మద్యం (J Brands Liquor) కారణంగా 30 వేల మంది చనిపోయారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బ్రాండ్లను రద్దు చేసి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఈ వాదనకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

2022 జూలై 19న లోక్‌సభలో(Lok Sabha) కున్వర్‌ దానిష్‌ (Kunwar Danish Ali) అలీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ (Nityanand Rai) ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కల్తీ మద్యం కారణంగా నమోదైన మరణాల వివరాలు వెల్లడయ్యాయి. ఆ గణాంకాల ప్రకారం 2016లో 23 మంది, 2017లో 183 మంది, 2018లో 42 మంది, 2019లో 27 మంది మరణించారు. అంటే 2016–2019 మధ్య నాలుగేళ్లలో మొత్తం 275 మంది కల్తీ మద్యం కారణంగా మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక జగన్‌ ప్రభుత్వ హయాంలో (Jagan Government Tenure) 2020లో 18 మంది మరణించినట్లు అదే కేంద్ర ప్రభుత్వ సమాధానంలో పేర్కొన్నారు. అనంతరం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (NCRB) ప్రచురించిన ‘Accidental Deaths & Suicides in India’ నివేదికల ప్రకారం 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కారణంగా మరణాలు లేవని గణాంకాలు చూపుతున్న వాస్తవం.

అధికారిక గణాంకాల ప్రకారం చూస్తే.. జగన్‌ పాలనలో 2020లో నమోదైన 18 మరణాలు మినహా, ఆ తర్వాతి సంవత్సరాల్లో కల్తీ మద్యం మరణాల నమోదు కనిపించదు. అదే సమయంలో చంద్రబాబు గత పాలనలో 2016 నుంచి 2019 వరకు 275 మంది కల్తీ మద్యం (Illicit Liquor) కారణంగా మరణించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే చంద్రబాబు చెబుతున్న 30 వేల మంది మరణాలు ఎక్కడ నమోదయ్యాయి? అందుకు ఆధారమైన అధికారిక గణాంకాలు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇక ‘జే బ్రాండ్స్‌’ ప్రచారంపైనా మరో అంశం చర్చకు వస్తోంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వలేదని, కొత్త బ్రాండ్లకు కూడా అనుమతులు ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘జే బ్రాండ్స్‌’గా ప్రచారం చేసిన పలు బ్రాండ్లు గత ప్రభుత్వాల కాలంలోనే మార్కెట్‌లోకి వచ్చినవేనని వారు చెబుతున్నారు.

మరోవైపు ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో టీడీపీకి(TDP) చెందిన నాయకులతో సంబంధాలున్నవారిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల వద్ద నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పట్టుబడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అలాగే మద్యం సేవించిన అనంతరం అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలు సైతం నమోదయ్యాయి.

మొత్తంగా చూస్తే.. రాజకీయ వేదికలపై వినిపించే ఆరోపణలకు, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలకు మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కాబట్టి ‘30 వేల మంది’ మరణాల వాదనకు ఆధారమేంటి? ఆ సంఖ్య ఏ అధికారిక నివేదిక ఆధారంగా చెబుతున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment