భారత ఎన్నికల సంఘం (Election Commission of India) అంతర్గత వ్యవహారాలపై ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’(The Indian Express)లో జర్నలిస్ట్ రితికా చోప్రా (Ritika Chopra) రాసిన పరిశోధనాత్మక కథనాలు ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఓటర్ల నమోదు ప్రక్రియ, ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్ వ్యవస్థ, ఫామ్-6లో మార్పులు, కమిషన్‌లోని భిన్నాభిప్రాయాలకు సంబంధించిన అంశాలను ఆమె కథనాలు ప్రస్తావించాయి. సెప్టెంబర్ 23న ప్రచురితమైన కథనంలో ఫామ్-6లో చేసిన కొన్ని మార్పులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు(Sukhbir Singh Sandhu), వివేక్ జోషి (Vivek Joshi) అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’(The Indian Express) పేర్కొంది.
ఈ కథనం వెలువడిన అనంతరం ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివిధ రాజకీయ పక్షాలు, వ్యక్తులు ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగానే ఓటు హక్కును నియంత్రిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Party), చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో మరో భారీ స్థాయి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని సైతం హెచ్చరించింది.
ఈ విమర్శల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వివరణ ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో కూడిన పూర్తి కమిషన్ సమావేశమై, షెడ్యూల్, నిర్ణయాలు సంస్థాగత నిబంధనలకు అనుగుణంగా సమిష్టిగా తీసుకున్నవేనని స్పష్టం చేసింది.
ఈ వివరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎక్స్ వేదికగా స్పందించడం ఇప్పుడు రాజకీయాల్లో మరో చర్చనీయంశంగా మారింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఏకగ్రీవ వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రత, విశ్వసనీయతను పునరుద్ఘాటించిందని, దీనితో అపోహలకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం విచారకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అంటే విజయాలతో పాటు ఓటములను కూడా హుందాగా స్వీకరించడమేనని, రాజ్యాంగ సంస్థలను గౌరవించడం నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.
అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపించాయి. కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ (Sourav Das) స్పందిస్తూ, “అధికార దాహంతో ఏమైనా చేస్తారా?” అంటూ ప్రశ్నించారు. మరికొందరు నెటిజన్లు కూడా చంద్రబాబు తాజా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గతంలో ఆయన ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీపై (Prime Minister Narendra Modi) చేసిన విమర్శలను గుర్తుచేశారు.
గతంలో చంద్రబాబు చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులను ప్రస్తావిస్తూ నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2019లో ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, దేశంలోని కీలక సంస్థల స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని ఆరోపించిన పోస్టులను వారు మళ్లీ ప్రస్తావిస్తున్నారు. సీబీఐ, ఆర్‌బీఐ నుంచి ఎన్నికల సంఘం వరకు రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర సంస్థలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు అప్పట్లో ప్రశ్నించిన విషయాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు.
దీంతో గతంలో ఎన్నికల వ్యవస్థపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం ఎన్నికల సంఘం వివరణకు ఆయన ఇచ్చిన మద్దతుకు మధ్య ఉన్న తేడాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అవకాశవాద రాజకీయాలు చంద్రబాబు నైజమంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో, టీడీపీ(TDP) అధిష్ఠానం నుంచి కూడా వివరణ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





