సీఎం చంద్రబాబుతో(CM Chandrababu) ఉద్యోగ సంఘాల (Employees’ Unions) నేతల భేటీ అనంతరం విజయవాడలోని(Vijayawada) ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు, ఏపీ ఎన్జీవో (APNGO) సంఘం నేతల మధ్య మాటల తూటాలు కాస్తా తోపులాట వరకు వెళ్లాయి. ఇరువర్గాల నేతలు పరస్పరం కాలర్లు పట్టుకుని తోసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవో నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలు(Employees Arrears), పీఆర్‌సీతో(PRC) పాటు ఇతర డిమాండ్లపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయాలను వెల్లడించే సమయంలోనే ఇరువర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి తలొగ్గి ఉద్యోగుల సమస్యలపై రాజీ పడుతున్నారనే ఆరోపణలు ఏపీ ఎన్జీవో నేతల నుంచి వినిపించాయి.
మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే నేతలు పరస్పరం కాలర్లు పట్టుకుని తోసుకున్నారు. ‘‘ఏం పీక్కుంటావో.. పీక్కో’’ అంటూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ (Suryanarayana) చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏకతాటిపై ఉండాల్సిన ఉద్యోగ సంఘాల మధ్యే బహిరంగంగా ఘర్షణ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల హక్కులు, పెండింగ్ బకాయిలు, పీఆర్‌సీ వంటి కీలక అంశాలపై సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు ఇప్పుడు బహిరంగ పోరుగా మారడం ఉద్యోగ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.





