కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అమ్మకానికి పెట్టారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. అర్హులకు అన్యాయం చేసి నకిలీ సర్టిఫికెట్లతో కొందరికి టీచర్ పోస్టులు కట్టబెట్టారని, ప్రశ్నాపత్రం లీక్, ప్రశ్నల విక్రయం వంటి అంశాలపై ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని సజ్జల డిమాండ్ చేశారు. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం, టెట్ అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించడం, టాపర్ నవీన్ పేరు తొలగించడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా, సోషల్ మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. డీఎస్సీ బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.





