దులీప్ ట్రోఫీ (Duleep Trophy) 2026 టైటిల్‌ను ఈస్ట్ జోన్ (East Zone) సొంతం చేసుకుంది. చెన్నైలోని(Chennai) ఎంఏ చిదంబరం స్టేడియంలో(MA Chidambaram Stadium) సౌత్ జోన్‌తో(South Zone) జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన భారీ ఆధిక్యం ఈస్ట్ జోన్‌కు టైటిల్‌ను అందించింది. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈస్ట్ జోన్ మరోసారి దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇషాన్ కిషన్(Ishan Kishan) నాయకత్వంలోని ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్ బ్యాటర్లు ఈస్ట్ జోన్ బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. దీంతో సౌత్ జోన్ 336 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 372 పరుగుల ఆధిక్యం లభించింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతను నిర్ణయించే నిబంధనల ప్రకారం ఈస్ట్ జోన్‌కు టైటిల్ దక్కింది. అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ జోన్ ఆటగాళ్లు జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసిన ఈస్ట్ జోన్.. ఐదో రోజు మరో 176 పరుగులు జోడించింది. చివరకు 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.
ఈస్ట్ జోన్ తరఫున ఖురైషీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. షమీ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు. చివరి రోజు ఆటలో ఈస్ట్ జోన్ 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. సౌత్ జోన్‌కు మ్యాచ్‌ను గెలిచే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకున్నాయి.
తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 372 పరుగుల ఆధిక్యం ఈస్ట్ జోన్‌కు విజయాన్ని ఖరారు చేసింది. ఇషాన్ కిషన్ నాయకత్వంలో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి టైటిల్‌ను అందుకుంది. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలవడం ఈస్ట్ జోన్ ఆటగాళ్లకు, అభిమానులకు ప్రత్యేక విజయంగా నిలిచింది.
టైటిల్ సాధించిన అనంతరం ఈస్ట్ జోన్ ఆటగాళ్లు మైదానంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి మైదానంలో నృత్యం చేస్తూ విజయోత్సాహాన్ని పంచుకున్నారు. మరోవైపు సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన కనబరిచి అత్యుత్తమ ఆటగాడి అవార్డును అందుకున్నాడు.







