---Advertisement---

ఈసీ చుట్టూ వివాదం.. ఏపీ ఎన్నికల ఫలితాలపై మళ్లీ చర్చ?

September 25, 2026

Summarize with AI

---Advertisement---

భారత ఎన్నికల సంఘం స్వతంత్రత (ECI Independence), ఎన్నికల కమిషనర్ల నియామక విధానం(Election Commissioners Appointment Process), 2024 ఎన్నికల నిర్వహణ, ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం (Polling Percentage) గణాంకాలు.. ఈ అంశాలన్నింటిపై గత కొంతకాలంగా చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా తాజాగా ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియపై వచ్చిన వార్తల నేపథ్యంలో 2024 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను కూడా మరోసారి పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే 2023 మార్చి నుంచి జరిగిన పరిణామాలను తేదీల వారీగా చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

2023 మార్చి 2: సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థపై 2023 మార్చి 2న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే కమిటీ సిఫార్సు చేయాలని కోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం స్వతంత్రతకు సంబంధించి ఈ తీర్పు కీలకంగా మారింది.

2023 డిసెంబర్: కొత్త నియామక చట్టం

సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 2023లో ఆమోదించిన చట్టం ప్రకారం ఎంపిక కమిటీలో(Selection Committee) ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉండే విధానం ఏర్పడింది. దీంతో సుప్రీంకోర్టు సూచించిన కమిటీలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర క్యాబినెట్ మంత్రికి చోటు లభించింది. ఈ మార్పు అప్పటినుంచే న్యాయపరమైన, రాజకీయ చర్చకు కారణమైంది.

2024 ఫిబ్రవరి 14: అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ

2024 లోక్‌సభ ఎన్నికలకు కొద్దివారాల ముందు ఎన్నికల సంఘంలో ఒక స్థానం ఖాళీ అయింది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే(Anup Chandra Pandey) ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేశారు. దీంతో అప్పటికి ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ మాత్రమే ఉన్నారు.

2024 మార్చి 9: అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు కొద్దిరోజుల ముందు, మార్చి 9న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ (Arun Goel) రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉండాల్సి ఉన్నప్పటికీ ముందుగానే పదవి నుంచి వైదొలిగారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి అదే రోజు ఆమోదించారు. దీంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.

అరుణ్ గోయల్ రాజీనామా వెనుక కారణాలను అధికారికంగా విస్తృతంగా వెల్లడించకపోవడంతో అప్పట్లో రాజకీయంగా అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆయన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి వారం ముందు రాజీనామా చేయడం చర్చనీయంశంగా మారింది, అలాగే ఆయన రాజీనామా చేసిన అదే రోజున ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, టీడీపీ పోత్తుని అధికారికంగా డిల్లీ వేదికగా ప్రకటించారు.

2024 మార్చి 14: జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు నియామకం

అరుణ్ గోయల్ అర్ధాంతరంగా రాజీనామా చేసిన ఐదు రోజుల్లోనే రెండు ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ పూర్తయింది. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ మాజీ ఐఏఎస్ అధికారులు (ప్రస్తుతం కాక్రోచ్ జనతాపార్టీ ఆరోపణలు చేస్తున్న అధికారి) జ్ఞానేశ్ కుమార్ , సుఖ్‌బీర్ సింగ్ సంధులను కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది. ఈ నియామకాలు 2023లో తీసుకొచ్చిన కొత్త చట్టం కింద జరిగిన తొలి నియామకాలుగా నిలిచాయి. అయితే ఎంపిక ప్రక్రియపై అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష సభ్యుడు అధీర్ రంజన్ చౌధురి అభ్యంతరం వ్యక్తం చేశారు. షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లు సమావేశానికి కొద్దిసేపటి ముందే తనకు అందాయని ఆయన ఆరోపించారు. ఎంపిక కమిటీలో ఆయన తన అసమ్మతిని తెలియచేశారు.

2024 మార్చి 15: కొత్త కమిషనర్లు బాధ్యతలు

జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. వీరి చేరికతో ఎన్నికల సంఘం మళ్లీ ముగ్గురు సభ్యులతో పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. వీరి నియమకం జరిగిన మరుసటిరోజునే వీరి ఆద్వర్యంలో మార్చి 16న 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహించబడ్డాయి. అంటే 2024 ఎన్నికల మొత్తం ప్రక్రియలో రాజీవ్ కుమార్‌తో పాటు ప్రస్తుతం వివాదాస్పద ఆరొపణలు ఎదుర్కుంటున్న జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఎన్నికల సంఘం సభ్యులుగా ఉన్నారు.

2024 మార్చి 21: నియామకాలపై సుప్రీంకోర్టులో సవాలు

కొత్త చట్టంలో సుప్రీం కోర్టూ చీఫ్ జస్టిస్ని ఎంపిక కమిటీ నుంచి తొలగించడం, జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త కమిషనర్ల నియామకంపై స్టే ఇవ్వాలని కూడా కోరారు. అయితే సుప్రీంకోర్టు వెంటనే వారి నియామకాలను నిలిపివేయడానికి నిరాకరించింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల సంఘంలో మార్పులు ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది కలిగించవచ్చనే అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

2024 మే 13: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్

మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 68.04 శాతం పోలింగ్ నమోదైనట్లు అప్పటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఇంకా క్యూలో ఉన్నారని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు 200 మంది వరకు వోటు హక్కు వినియొగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారని ప్రకటించారు. క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించడంతో సాధారణ పోలింగ్ సమయం తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది.

మే 13, రాత్రి 8 గంటలు: 68.12 శాతం

సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు గంటలు గడిచిన తర్వాత ఈసీఐ విడుదల చేసిన గణాంకాల్లో పోలింగ్ 68.12 శాతంగా నమోదైంది. అంటే 5 గంటల 68.04 శాతం నుంచి 8 గంటల 68.12 శాతానికి పెరుగుదల కేవలం 0.08 శాతం. ఈ 0.08 శాతం పెరుగుదలను మొత్తం ఓటర్ల సంఖ్యకు అన్వయిస్తే సుమారు 33,064 ఓట్లకు సమానమని లెక్కించాయి.

మే 13, రాత్రి 11:45 గంటలు: 76.50 శాతం

రాత్రి 11:45కు ఈసీఐ విడుదల చేసిన గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతం ఒక్కసారిగా 76.50 శాతానికి పెరిగింది. అంటే రాత్రి 8 గంటల 68.12 శాతం నుంచి 11:45 గంటల 76.50 శాతానికి (8.38 శాతం) పెరుగుదల నమోదైంది. ఈ 8.38 శాతం పెరుగుదల సుమారు 34,63,767 ఓట్లకు సమానమని లెక్కించారు. అంటే 8 గంటల నుంచి 11:45 మధ్య కేవలం 3 గంటల 45 నిమిషాల్లో భారీ సంఖ్యలో ఓట్లు గణాంకాల్లో చేరినట్లు కనిపిస్తోంది.

మే 14 తెల్లవారుజాము: కొన్ని కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింపు

మే 13న సాయంత్రం సాధారణ పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. ఇదే అంశం తరువాత 2024 ఏపీ ఎన్నికలపై వచ్చిన ప్రధాన ఆరోపణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా 3,500 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి వరకు పోలింగ్ కొనసాగడం, ఆ తర్వాత తుది పోలింగ్ గణాంకాల్లో భారీ పెరుగుదల కనిపించడం వంటి అంశాలను కలిపి ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. పోలింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈసీఐ మే 17న మరో గణాంకాన్ని విడుదల చేసింది. ఈసీఐ విడుదల చేసిన ప్రకారం ఈవీఎం ఓట్ల ఆధారిత పోలింగ్ శాతం 80.66 శాతానికి చేరింది. తరువాత మొత్తం పోలింగ్ 81.79 శాతంగా నమోదైంది.

అంటే మే 13 సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన 68.04 శాతం నుంచి ఈసీఐ చివరిలో చెప్పిన 80.66 శాతం వరకు మొత్తం 12.54 శాతం పెరుగుదల కనిపించింది. ఈ తేడా సుమారు 51,83,249 ఓట్లకు సమానం. మే 13 సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదైనప్పుడు 3,500 కేంద్రాల్లో ఇంకా క్యూలు ఉన్నాయని, ఆ క్యూ లైన్ లో సుమారు ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 200 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. ఆ తర్వాత 68.12 శాతం నుంచి 76.50 శాతానికి, అనంతరం 80.66 శాతానికి పెరిగిన గణాంకాలను చూస్తే భారీ సంఖ్యలో ఓట్లు రాత్రి సమయంలో నమోదైనట్లు కనిపిస్తోందని విమర్శకులు చెబుతున్నారు.

3500 పోలింగ్ కేంద్రాల్లో.. 200 మంది క్యూలో ఉన్నారనే లెక్కపైనే అనుమానాలు?

అప్పటి ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌ కుమార్‌ మీనా ప్రకారం సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో ఉన్నారు. ఒక్కో కేంద్రంలో గరిష్టంగా 200 మంది వరకు ఉన్నారని చెప్పిన గణాంకాన్ని ఆధారంగా తీసుకుంటే మొత్తం క్యూలో ఉన్నవారి సంఖ్య సుమారు 7 లక్షలు అవుతుందని విమర్శకులు లెక్కిస్తున్నారు. అయితే మే 13 సాయంత్రం 5 గంటల తర్వాత తుది గణాంకాల్లో చేరిన 12.54 శాతం పెరుగుదల ఓట్లను 51.83 లక్షలుగా లెక్కించడం వల్ల ఈ రెండు సంఖ్యల మధ్య భారీ తేడా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫార్మ్ 20 ఆన్లైన్ లో పెట్టడానికి 107 రోజులు ఎందుకు పట్టిందనేది సమాదానంలేని ప్రశ్న, సాధారణంగా ఇది కేవలం ఒక్కరోజు లోనే అందుబాటులోకి వస్తుంది.

2024 జూలై 29న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సైతం 2024 లోక్‌సభ ఎన్నికలపై మరో విశ్లేషణ విడుదల చేసింది. ఏడీఆర్ ప్రకారం 538 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలు కనిపించాయి. ఆ సంస్థ లెక్కల ప్రకారం: 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 5,54,598 ఓట్లు తక్కువగా లెక్కించబడ్డాయి. అదే సమయంలో, 176 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 35,093 ఓట్లు ఎక్కువగా లెక్కించబడ్డాయి. అలాగే తుది పోలింగ్ డేటా విడుదలలో ఆలస్యం, నియోజకవర్గం మరియు పోలింగ్ స్టేషన్ స్థాయిలో గణాంకాలు అందుబాటులో లేకపోవడంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రశ్నలు లేవనెత్తింది. అలాగే తన విశ్లేషణలో గుర్తించిన పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలకు వివరణ ఇవ్వాలని ఏడీఆర్ ఎన్నికల సంఘాన్ని కోరింది. ముఖ్యంగా తుది ఓటింగ్ డేటా విడుదలలో ఆలస్యం, నియోజకవర్గాల వారీగా పూర్తి డేటా అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై సంస్థ ప్రశ్నలు లేవనెత్తింది.

2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం 68.04 నుంచి 80.66 శాతానికి చేరుకోవడం, మధ్యలో 68.12 శాతం, 76.50 శాతం వంటి దశల వారీ గణాంకాలు వెలువడటం, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా పోలింగ్ కొనసాగడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలైన మరియు లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలను ప్రస్తావించడం.. ఇవన్నీ కలిసి ఎన్నికల డేటా పారదర్శకతపై చర్చకు దారితీశాయి.

ఇదే సమయంలో 2024 ఎన్నికలను నిర్వహించిన ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో అప్పటి సీఈసీ రాజీవ్ కుమార్‌తో పాటు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉన్నారు. ఇప్పుడు 2026లో ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయ ప్రక్రియపై కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాల వార్తలు వెలుగులోకి రావడంతో 2024 ఎన్నికల సమయంలోని ఈ పాత ప్రశ్నలు కూడా మరోసారి చర్చలోకి వస్తున్నాయి.

2023లో ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థపై సుప్రీంకోర్టు తీర్పు నుంచి.. 2023 చివర్లో కొత్త నియామక చట్టం వరకు.. 2024లో అరుణ్ గోయల్ రాజీనామా నుంచి జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు నియామకం వరకు.. ఆ తర్వాత అదే కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ ఎన్నికల పోలింగ్ గణాంకాల వరకు జరిగిన పరిణామాలన్నీ ఇప్పుడు ఒకే కాలక్రమంలో పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు చెబుతున్న మాట.

చివరికి ఈ వ్యవహారంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతి గణాంకానికి, ప్రతి పోలింగ్ కేంద్రానికి, ప్రతి ఓటుకు సంబంధించిన అధికారిక రికార్డులు ఎంత పారదర్శకంగా ప్రజల ముందుకు వస్తాయన్నదే కీలకమైన అంశంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment