అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju district) జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన్న గంగవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రసవం (Delivery) అనంతరం అస్వస్థతకు గురైన 28 ఏళ్ల గిరిజన మహిళ (Tribal Woman) పంగి లావణ్యను (Pangi Lavanya) ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, భారీ వర్షాలు(Heavy Rains), వరదల (Floods) కారణంగా గంగవరం తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో రవాణా సౌకర్యం నిలిచిపోయింది. సకాలంలో వైద్య సహాయం అందక ఆమె మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రతి వర్షాకాలంలో గంగవరం వాగుపై తాత్కాలిక వంతెన (Temporary Bridge) వరదలకు కొట్టుకుపోతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన ధ్వంసం కావడంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లోని (Andhra Pradesh-Odisha Border) 15కు పైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో గ్రామస్థులే శ్రమదానంతో తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, తాజాగా అవి కూడా వరదలకు కొట్టుకుపోయాయి.
ఈ ఘటనపై సీపీఐ(ఎం) (CPI(M)) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ (Andhra Pradesh State Committee) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రవాణా సౌకర్యాలు లేక బాలింత (Postpartum Woman) మృతి చెందడం విషాదకరమని, గంగవరం వంతెనను శాశ్వతంగా నిర్మించడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, వైద్య సేవలను బలోపేతం చేయాలని డిమాండ్ చేసింది. మృతి చెందిన పంగి లావణ్య కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని, తల్లిని కోల్పోయిన శిశువుకు పాలు, పోషకాహారం, వైద్య సహాయం కల్పించాలని కోరింది.





