బోడుప్పల్(Boduppal) పరిధిలోని పలు కాలనీలకు చెందిన ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితాలో (Prohibited List) చేర్చడంపై బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా పేరుతో ప్రజల ఆస్తులను అడ్డుకునే అధికారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి (Revanth Reddy Government) ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బహిరంగంగా 30 శాతం కమీషన్(Commission) ప్రభుత్వంగా విమర్శిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ప్రజలు ఏళ్ల తరబడి అనుభవిస్తున్న ఆస్తులపై నిషేధిత జాబితా పేరుతో ఆంక్షలు విధించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్(Tirumala Meadows), లక్ష్మీ గణపతి కాలనీ(Lakshmi Ganapathi Colony), హేమానగర్(Hemanagar) కాలనీలకు చెందిన వందలాది మంది బాధితులు హరీష్ రావును కలిసి తమ సమస్యలను వివరించారు. సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో సుమారు 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా దాదాపు 1,500 కుటుంబాలు నివసిస్తున్నాయని ఆయన తెలిపారు.
దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను అర్బన్ ల్యాండ్ సీలింగ్(Urban Land Ceiling) పేరుతో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని హరీష్ రావు మండిపడ్డారు. తమ అవసరాల కోసం ఆస్తులను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్(Registration)కార్యాలయాలకు వెళ్లిన సమయంలో అవి నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలియడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల విషయంలో కృత్రిమ వివాదాలు సృష్టించి ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 22ఏ నిబంధన పేరుతో ప్రజలను భయపెట్టి బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే వ్యవహారాలకు తెరలేపారని ఆయన విమర్శించారు.
బోడుప్పల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు అధైర్యపడవద్దని హరీష్ రావు సూచించారు. బాధితుల ఆస్తులను కాపాడేందుకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఆయా కాలనీలను వెంటనే 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించకపోతే బాధితుల తరఫున పెద్దఎత్తున పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.






