---Advertisement---

హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. జనసేన పలుకుబడి ముందు కేసు నీరుగారుతుందా?

September 1, 2026

Summarize with AI

---Advertisement---

హైదరాబాద్‌ రాయదుర్గంలో జరిగిన ఘోర హిట్‌ అండ్‌ రన్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు సన్నిహితుడిగా పేర్కొనబడుతున్న ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ అరెస్టు కావడం ఈ కేసును మరింత చర్చనీయాంశంగా మార్చింది. వరుసగా జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో బిహార్‌కు చెందిన నందులాల్‌ ప్రాణాలు కోల్పోగా, జైద్‌ షా ఖాద్రీ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ రోటరీ–ఖాజాగూడ ప్రధాన రహదారిపై నందులాల్‌ను తొలుత వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయిన అతడిని ఆసుపత్రికి తరలించేందుకు జైద్‌ షా ఖాద్రీ ప్రయత్నిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన మరో మహీంద్రా కారు వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండో ప్రమాదంలో నందులాల్‌ మృతి చెందగా, జైద్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదం అనంతరం వాహనాలు ఆగకుండా వెళ్లిపోయినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో సందీప్‌కు సంబంధించిన వాహనాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంబంధిత వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసు దర్యాప్తు, నమోదు చేసిన సెక్షన్లు, నిందితులపై తీసుకునే చర్యల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ, సామాజిక పలుకుబడి ఉన్న వ్యక్తులకు సంబంధించిన కేసుల్లో విచారణపై అనుమానాలు తలెత్తకుండా పోలీసులు స్పష్టమైన వివరాలను వెల్లడించాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు.

ఇటీవల రాజకీయంగా ప్రభావవంతమైన జనసేన ఎంపీ లింగమనేని కొడుకుకు సంబంధించిన రోడ్డు ప్రమాద కేసుల దర్యాప్తుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈ కేసులోనూ చట్టం అందరికీ సమానంగా అమలవుతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే విచారణ వేగంగా, నిష్పక్షపాతంగా, పూర్తి పారదర్శకతతో సాగాలని ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment