అక్టోబర్లో(October) వాతావరణం చల్లబడుతుందని (Cool) భావిస్తున్న తెలంగాణ ప్రజలకు (Telangana People) భారత వాతావరణ శాఖ (ఐఎండీ) (IMD) తాజా అంచనాలు కీలక సూచనలు ఇస్తున్నాయి. ఈ నెలలో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు (Temperatures) సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది.
ఐఎండీ అంచనాల ప్రకారం తెలంగాణలో అక్టోబర్ నెలలో సాధారణ స్థాయితో పోలిస్తే వర్షపాతం (Rainfall) తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ సమయంలో సాధారణంగా కనిపించే చల్లటి వాతావరణానికి బదులుగా వేడి వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే సీజన్లోనూ రాష్ట్రంలో మొత్తం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్టంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
భూమధ్యరేఖా(Equatorial) పసిఫిక్ మహాసముద్రంపై(Pacific Ocean) ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు (El Niño Conditions) కొనసాగుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ పరిస్థితులు ఏడాది చివరి వరకు మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు హిందూ మహాసముద్రంపై ఐఓడీ పరిస్థితులు ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. రాబోయే ఈశాన్య రుతుపవనాల కాలంలోనూ ఈ పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ సముద్ర వాతావరణ పరిస్థితుల ప్రభావం తెలంగాణ వాతావరణంపైనా పడే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్లోనే కాకుండా రాబోయే నెలల్లోనూ రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది.








