హైదరాబాద్లోని శంషాబాద్(Shamshabad) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Rajiv Gandhi International Airport) ఇండిగో(IndiGo) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూణే నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో 6ఈ352 విమానాన్ని గాల్లో పక్షి(Bird) ఢీకొట్టినట్లు పైలట్ గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఎయిర్పోర్ట్లో దించారు. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విమానం ముందు భాగంలో సొట్ట(Dent) పడినట్లు గుర్తించారు. పక్షి ఢీకొట్టడం (Bird Strike) వల్లే ఈ నష్టం జరిగినట్లు సాంకేతిక బృందం నిర్ధారించింది. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించి, తదుపరి తనిఖీల కోసం విమానాన్ని నిలిపివేశారు.
షెడ్యూల్ ప్రకారం ఈ విమానం శంషాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లాల్సి ఉంది. అయితే విమానం ముందు భాగం దెబ్బతినడంతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చండీగఢ్ సర్వీసును(Chandigarh Service) రద్దు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇండిగో అధికారులు తెలిపారు.







