ఆసియా క్రీడల్లో (Asian Games) భారత క్రీడాకారులు (Indian Athletes) తొలిరోజే తమ సత్తా చాటారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇలవేనిల్ వలరివన్(Elavenil Valarivan), సోనమ్ మస్కర్(Sonam Maskar), విదర్సా వినోద్‌లతో (Vidarsa Vinod) కూడిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని సాధించింది. అత్యుత్తమ పాయింట్లు నమోదు చేసిన భారత బృందం చైనా (China) తర్వాతి స్థానంలో నిలిచింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది.
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ (Mixed Martial Arts) భారత్‌కు పతకం ఖాయమైంది. భారత అథ్లెట్ సుచిక క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థిని ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ విభాగంలో భారత్‌కు కనీసం కాంస్య పతకం దక్కనుంది.
భారత మహిళల హాకీ జట్టు (Indian Women’s Hockey Team) కూడా టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. తొలి లీగ్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై (Uzbekistan) పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు 19-0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో టోర్నీపై తమ ఉద్దేశాన్ని చాటింది.
అయితే వుషు, టెక్బాల్లో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. పురుషుల చాంగ్‌క్వాన్ విభాగంలో సూరజ్ సింగ్ 11వ స్థానంలో నిలిచాడు. టెక్బాల్ మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ కాంస్య పతక పోరుల్లో భారత ఆటగాళ్లు ఓటమిపాలయ్యారు.







