జపాన్(Japan) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు (Asian Games) 2026లో టీమిండియా (Team India) అదరగొట్టింది. పురుషుల క్రికెట్ టోర్నీలో శ్రీలంకతో(Sri Lanka) జరిగిన రెండో సెమీఫైనల్‌లో(Second Semi-Final) భారత్ 124 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించిన టీమిండియా లంకను కేవలం 45 పరుగులకే కట్టడి చేసి ఫైనల్ బెర్త్ (Final Berth) ఖరారు చేసుకుంది.
కొరోగి స్పోర్ట్స్ పార్క్, నిస్షిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ప్రారంభంలో లంక బౌలర్లు భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచి వరుస వికెట్లు తీసినా.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు.
ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేశాడు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా చెలరేగాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి భారత్‌కు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13, అక్షర్ పటేల్ 8, వాషింగ్టన్ సుందర్ 7 పరుగులు చేశారు.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే వికెట్లు తీస్తూ లంక బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ఫలితంగా శ్రీలంక 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌట్ అయింది.
నువానిదు ఫెర్నాండో 15 పరుగులతో ఆ జట్టు తరఫున అత్యధిక స్కోరు చేశాడు. అతడిని మినహాయిస్తే మరే లంక బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. పలువురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, మరికొందరు డకౌట్‌గా వెనుదిరిగారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. దీంతో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ ఫైనల్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది.







