కొన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పటికీ అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి వాటిలో 2007 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ఫైనల్ ఒకటి. సెప్టెంబర్ 24, 2007న జోహన్నెస్‌బర్గ్(Johannesburg) వాండరర్స్ స్టేడియంలో(Wanderers Stadium) జరిగిన ఫైనల్లో(Final) భారత్(India) 5 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను(Pakistan) ఓడించి తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) నాయకత్వంలోని యువ భారత జట్టు చరిత్ర సృష్టించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) 54 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) 30 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఉమర్ గుల్ 3 వికెట్లు తీశాడు.
158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత బౌలర్లు ఒత్తిడిలోకి నెట్టారు. 6 వికెట్లకు 77 పరుగుల వద్ద నిలిచిన ఆ జట్టును మిస్బా-ఉల్-హక్ ఆదుకున్నాడు. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 3 సిక్సర్లు బాది పాకిస్థాన్‌ను విజయానికి చేరువ చేశాడు.
చివరి ఓవర్లో మారిన చరిత్ర
చివరి ఓవర్లో పాకిస్థాన్‌కు 13 పరుగులు కావాల్సి ఉండగా ధోనీ బంతిని జోగిందర్ శర్మకు (Joginder Sharma) అందించాడు. ఫుల్‌టాస్ బంతిని మిస్బా సిక్సర్‌గా మలచడంతో 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఆ తర్వాత మిస్బా స్కూప్ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. శ్రీశాంత్ అద్భుతంగా క్యాచ్ అందుకోవడంతో పాకిస్థాన్ 152 పరుగులకే ఆలౌటైంది. భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ధోనీ సేనకు చిరస్మరణీయ విజయం
మిస్బా 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, భారత్ తరఫున ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ చెరో 3 వికెట్లు, జోగిందర్ శర్మ 2 వికెట్లు తీశారు. ఇర్ఫాన్ పఠాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, షాహిద్ అఫ్రిదీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు దక్కాయి.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్.. 24 ఏళ్ల తర్వాత ధోనీ నాయకత్వంలో మరో ప్రపంచకప్‌ను అందుకుంది. ముఖ్యంగా చివరి ఓవర్లో(Last Over) జోగిందర్ బౌలింగ్, మిస్బా స్కూప్, శ్రీశాంత్ క్యాచ్ ఈ విజయాన్ని భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి.







