IPL 2026 Awards Winners List: ఐపీఎల్ 2026 సీజన్ ఘనంగా ముగిసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను (Gujarat Titans) 5 వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru – RCB) వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) నాయకత్వంలో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న మూడో జట్టుగా గుర్తింపు పొందింది.
అయితే ఈ సీజన్‌లో జట్టు విజయాల కంటే ఎక్కువగా చర్చనీయాంశమైన పేరు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ఐపీఎల్ 2026ను తన పేరిట మార్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్ ఏకంగా 5 ప్రధాన వ్యక్తిగత అవార్డులను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ సీజన్‌లో 776 పరుగులు సాధించిన వైభవ్ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే 72 సిక్సర్లు బాది అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ స్ట్రైకర్ అవార్డుతో పాటు టాటా సియెర్రా (Tata Sierra) కారును కూడా బహుమతిగా అందుకున్నాడు. మొత్తంగా రూ.40 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.
అవార్డుల ప్రదానోత్సవం అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇంత పెద్ద వేదికపై మాట్లాడటం కొంత ఒత్తిడిగా అనిపిస్తోందని, వచ్చే ఏడాది మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపాడు. మొదటి బంతినే బౌండరీకి పంపగలననే నమ్మకం ఉంటే ఎలాంటి సందేహం లేకుండా షాట్ ఆడతానని పేర్కొన్నాడు.
అదే సమయంలో ఈ సీజన్ తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిందని చెప్పాడు. ప్రతి బంతినీ బలంగా కొట్టడం సాధ్యం కాదని, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, మ్యాచ్ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నానని వెల్లడించాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టి గాయాలకు దూరంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.
IPL 2026 అవార్డుల పూర్తి జాబితా:
ఆరెంజ్ క్యాప్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) – 776 పరుగులు.
పర్పుల్ క్యాప్: కగిసో రబడ (Kagiso Rabada) – 29 వికెట్లు.
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): వైభవ్ సూర్యవంశీ – 436.5 MVP పాయింట్లు.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: వైభవ్ సూర్యవంశీ.
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ.
మోస్ట్ ఫోర్స్ ఆఫ్ ది సీజన్: సాయి సుధర్సన్ (Sai Sudharsan) – 75 ఫోర్లు.
మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ – 72 సిక్సర్లు.
క్యాచ్ ఆఫ్ ది సీజన్: మనీష్ పాండే (Manish Pandey) – ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసిన అద్భుత వన్-హ్యాండ్ క్యాచ్.
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ (టాటా సియెర్రా కారు బహుమతి).
మోస్ట్ డాట్ బాల్స్ అవార్డు: మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) – 172 డాట్ బాల్స్.
ఫెయిర్ ప్లే అవార్డు: పంజాబ్ కింగ్స్ (Punjab Kings).
ఉత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డులు:
ఐపీఎల్ 2026లో అత్యుత్తమ పిచ్ & గ్రౌండ్ నిర్వహణకు “క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్” కు అవార్డు దక్కించుకుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించినందుకు ఈ సంఘానికి రూ.50 లక్షల నగదు బహుమతి లభించింది. అలాగే తక్కువ మ్యాచ్‌ల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందింది.






