అహ్మదాబాద్‌లోని (Ahmedabad) నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) ఐపీఎల్ 2026(IPL 2026) తుది సమరానికి సిద్ధమైంది. టోర్నీ మొత్తం దూకుడుగా ప్రత్యర్థులను చిత్తు చేసిన బెంగళూరు జట్టు(RCB), ప్రశాంతంగా వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు సాగిన గుజరాత్‌తో(GT) ఆదివారం ఫైనల్లో(Final) తలపడనుంది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత గత సీజన్లో ట్రోఫీని గెలిచిన ఆర్సీబీ, వరుసగా రెండోసారి కప్‌ను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, బెంగళూరుకు అడ్డుకట్ట వేసి మరోసారి టైటిల్ గెలవాలని భావిస్తోంది.
ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే ఆర్సీబీనే(RCB) హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. రజత్ పాటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఆ జట్టు వరుసగా రెండో టైటిల్ సాధించి చెన్నై, ముంబై సరసన నిలవాలని చూస్తోంది. అయితే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నాయకత్వంలోని గుజరాత్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన గుజరాత్, రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్ చేరింది. అంతేకాకుండా సొంత మైదానంలో ఆడటం ఆ జట్టుకు అదనపు బలంగా మారింది.
భీకర బ్యాటింగ్‌తో ఆర్సీబీ దూకుడు
ఈ సీజన్లో ఆర్సీబీ అత్యంత దూకుడైన బ్యాటింగ్ శైలిని ప్రదర్శించింది. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి బౌలింగ్ వ్యూహాలు ఎలా ఉన్నా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఈ సీజన్లో ఆర్సీబీ 8 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది.
కెప్టెన్ రజత్ పాటిదార్ ప్రశాంత నిర్ణయాలు జట్టుకు గొప్ప స్థిరత్వాన్ని అందించాయి. సీనియర్, యువ ఆటగాళ్లను సమర్థంగా సమన్వయం చేస్తూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణిస్తోంది. పవర్‌ప్లే నుంచే ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచుతోంది.
26 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో 2వ స్థానంలో ఉన్న భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేస్ దాడికి నాయకత్వం వహిస్తున్నాడు. అతడికి తోడుగా జోష్ హేజిల్‌వుడ్ 13 వికెట్లు, రసిఖ్ సలామ్ 16 వికెట్లు, కృనాల్ పాండ్యా 13 వికెట్లతో రాణిస్తున్నారు. కృనాల్ బ్యాట్‌తోనూ కీలక పరుగులు అందించాడు. అయితే గుజరాత్ టాప్ ఆర్డర్‌ను ఎంత సమర్థంగా కట్టడి చేస్తారనేదే ఆర్సీబీ విజయావకాశాలను నిర్ణయించనుంది.
గుజరాత్ ఆశలన్నీ టాప్ ఆర్డర్‌పైనే
ఇతర జట్లు పవర్‌ప్లేలో ఓవర్‌కు 11 నుంచి 12 పరుగుల రన్‌రేట్‌తో ఆడుతుండగా, గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సంప్రదాయ శైలిలో 9 రన్‌రేట్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. మిడిల్ ఆర్డర్ బలహీనత కారణంగా టాప్-3 బ్యాటర్లపైనే భారీ బాధ్యత పడుతోంది.
శుభ్‌మన్ గిల్ 163 స్ట్రైక్‌రేట్‌తో 722 పరుగులు, సాయి సుదర్శన్ 159 స్ట్రైక్‌రేట్‌తో 710 పరుగులు, జోస్ బట్లర్ 157 స్ట్రైక్‌రేట్‌తో 507 పరుగులు సాధించి జట్టుకు వెన్నెముకలా నిలిచారు. ఫైనల్లో కూడా ఈ ముగ్గురిపైనే గుజరాత్ ఆశలు పెట్టుకుంది.
సొంత మైదానంలో ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించడం గుజరాత్‌కు మరో సానుకూల అంశం. బౌలింగ్ విభాగంలో కూడా టైటాన్స్‌కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది.
రబాడ-సిరాజ్‌లపై బౌలింగ్ భారం
28 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న కగిసో రబాడ గుజరాత్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్నాడు. అతడికి తోడుగా మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సీజన్లో రబాడ 165 డాట్ బాల్స్, సిరాజ్ 162 డాట్ బాల్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. హార్డ్ లెంగ్త్ బౌలింగ్‌తో పెద్ద షాట్లకు అవకాశం ఇవ్వకుండా నియంత్రిస్తున్నారు. అయితే సిరాజ్ ఫిట్నెస్ గుజరాత్ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజం నొప్పితో ఇబ్బంది పడిన సిరాజ్, ఫైనల్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
పిచ్, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
గత ఫైనల్‌కు ఉపయోగించిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటికే 2 సార్లు ఈ వికెట్‌ను ఉపయోగించారు. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా ఛేజింగ్ చేసే జట్లకు అనుకూలంగా ఉంటుంది. గత 6 ఐపీఎల్ ఫైనల్స్‌లో 4 సార్లు లక్ష్య ఛేదన చేసిన జట్లే విజేతలుగా నిలిచాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదివారం వర్షం పడే అవకాశం లేదు. ఒకవేళ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే సోమవారం రిజర్వ్ డే అందుబాటులో ఉంటుంది.






