వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (సెప్టెంబర్ 10, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు కూటమి ప్రభుత్వ పాలన, అవినీతి, అక్రమాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. దీంతో జగన్ ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇక ఇవాళ బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయం ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారిందని పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా ఒక మ్యానిఫెస్టోకు అర్థం తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్‌సీపీ మాత్రమేనని జగన్ అన్నారు. ఈ విషయాన్ని సగర్వంగా చెప్పగలుగుతామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపటి ప్రెస్‌మీట్‌లో జగన్ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు? ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.





