రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వరుసగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న నేపథ్యంలో.. ఆయన ప్రశ్నల తర్వాతే కూటమి ప్రభుత్వం (Coalition Government) చర్యలకు దిగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. గుంటూరు మిర్చి(Guntur Chilli, పొగాకు రైతుల సమస్యల (Tobacco Farmers) నుంచి ఆక్వా దాణా (Aqua Feed) ధరల తగ్గింపు వరకు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (Veterinary Assistant Surgeon) నియామకాల్లో రాత పరీక్ష పునరుద్ధరణ నుంచి కరువు పరిస్థితులపై సమీక్షల వరకు పలు అంశాల్లో జగన్ స్పందించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) పేర్కొంటోంది.
గుంటూరు మిర్చి రైతులు, పొదిలి పొగాకు రైతుల సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసిన అనంతరం.. పొగాకు కొనుగోళ్లలో రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, వేలం కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆక్వా దాణా ధరలు పెరగడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జగన్ ఆందోళనకు హెచ్చరించగా, ఫీడ్ ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశమై ధరను కిలోకు రూ.4 తగ్గించేలా చర్యలు చేపట్టింది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టాలన్న నిర్ణయంపైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేశాయి. అనంతరం ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించి ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా రాత పరీక్ష నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చింది.
ఇక రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలపై సెప్టెంబర్ 17న జగన్ పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించి, తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో 513 మండలాల్లో కరువు పరిస్థితులను అధికారులు గుర్తించడంతో పాటు విశాఖపట్నంతో సహా పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యపై ప్రభుత్వం సమీక్షలు నిర్వహించింది.
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ (Gade Saikrishna Lockup Death) వ్యవహారం నుంచి రైతుల సమస్యలు, ఆక్వా దాణా ధరలు, ఉద్యోగ నియామకాలు, కరువు పరిస్థితుల వరకు.. జగన్ గళమెత్తిన ప్రతి అంశం తర్వాత ప్రభుత్వం స్పందిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.





